Gold Theft in Teachers Colony in Achampet : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో సినిమాను తలపించేలా బంగారు ఆభరణాల చోరీ ఘటన చోటు చేసుకుంది. అచ్చంపేటలో టీచర్స్ కాలనీలో ధరణి అనే మహిళను బెదిరించి ఆమె నుంచి 12 తులాల బంగారు ఆభరణాలను ఇద్దరు గుర్తుతెలియని మహిళలు కొట్టేశారు.
పోలీసుల వివరాల ప్రకారం : ధరణి అనే మహిళ టీచర్‌గా పనిచేసి ఇటీవల వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఇంటి వద్దే ఉంటున్నారు. ఆమె భర్త ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కాగా వీరికి సొంతంగా ఒక పెద్ద భవనం ఉంది. దానిలో న్యూ ఎక్సీడ్ స్కూల్ కోసం ప్రిన్సిపల్ శ్వేతకు లీజ్‌కు ఇచ్చారు. యజమానులు ధరణి ఆమె కుటుంబం అదే బిల్డింగ్‌లో మూడో అంతస్తులో ఉంటున్నారు.
గదులు అద్దెకు ఇవ్వడం కుదరదు : ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళలు బురఖాలు ధరించి అచ్చంపేటలోని న్యూ ఎక్సీడ్ స్కూల్‌కు వెళ్లారు. అక్కడ థర్డ్ ఫ్లోర్‌కు నేరుగా వెళ్లి ఈ స్కూల్ ప్రిన్సిపల్ శ్వేత గదులు అద్దెకు కావాలంటే మీ పేరు చెప్పడంతో ఇక్కడికి వచ్చామని పరిచయం చేసుకున్నారు. దీంతో ఆ మహిళ ప్రిన్సిపల్ పేరు చెప్పగానే కొద్దిగా వీళ్లను నమ్మారు. ఓ రూమ్ అద్దెకు కావాలంటూ ఓనర్ ధరణిని అడిగారు. అద్దెకు గదులు లేవని, తమ కూతురు పెళ్లి ఉందని అద్దెకు ఇవ్వడం లేదని ధరణి అనే మహిళ వారికి చెప్పారు. దీంతో ఏలాగైనా చోరీ చేయాలనే ఉద్దేశంతో వెంటనే ఆలోచించుకుని తమకు మంచినీరు కావాలంటూ ధరణిని అడిగారు.
మెడకు చున్నీ వేసి దాడి : వాటర్ తీసుకురావడానికి ఆ మహిళ ఇంట్లోకి వెళ్లగానే ఆమె వెనకాలే వెళ్లి ఒక్కసారిగా ధరణి మెడకు చున్ని వేసి చంపబోయారు. తీవ్రంగా భయపడిన ధరణి స్పందించి నన్ను ఏం చేయొద్దు కావాలంటే మీకు ఏమైనా కావాలంటే తీసుకోండి అంటూ చోరీకి వచ్చిన నిందితులను ఆ బాధితురాలు వేడుకుంది. దీంతో ఆమె వద్ద ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలు(గాజులు, మంగళసూత్రం, పూసల దండ) తీసుకొని చోరీకి వచ్చిన మహిళలు క్షణాల్లో అక్కడి నుంచి ఊడాయించారు.
పోలీసుల దర్యాప్తు : ఒక్కసారిగా షాక్‌కు గురైన బాధిత మహిళ అప్రమత్తమై వెంటనే అచ్చంపేట టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు తెలిసిన వారి లాగే నేరుగా మూడో అంతస్తులో ఉన్న మా ఇంటికి రావడం అనుమానంగా ఉందని బాధితురాలు ధరణి చెప్పారు. విషయం తెలుసుకొని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయిన ఆ మహిళల దృశ్యాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. పట్టణంలో ఇలాంటి చోరీ కావడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు.