CM Revanth Reddy Attend IPS Officers Get Together: ఆర్థికంగా, సామాజికంగా విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని, ఇందులో పోలీసులు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. గత పదేళ్ల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతిన్నదని, ఈ పరిస్థితి నుంచి తెలంగాణను బయటపడేయాల్సిన సమయం వచ్చిందన్నారు. అందుకోసం పోలీస్ ఆఫీసర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని పేర్కోన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టు గెదర్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
త్వరలో మరో 2 గ్యారంటీల అమలుకు శ్రీకారం - కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
CM Revanth Reddy Instructions to IPS Officers : కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాము పాలకులమేనని, పోలీసులను సబ్ ఆర్డినేట్లుగా చూసే పద్ధతి తమ ప్రభుత్వంలో ఉండదని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ఓ అవకాశంగా మాత్రమే ఈ అధికారాన్ని భావిస్తున్నామని చెప్పారు. ప్రజలకు సేవ చేయడంలో అందరినీ దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, పునర్నిర్మాణంలో పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనలను స్వీకరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ క్రయవిక్రయాలపై ఉక్కుపాదం మోపి హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీ(Drugs Free City)గా చేయాలని సూచించారు. యువతీ, యువకులను డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడేయాలని విజ్ఞప్తి చేశారు.