CM Revanth Reddy Dance at Sadar sammelanam in NTR Stadium :యాదవ జాతి నిత్యం అభివృద్ధిని కాంక్షించేదని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ అభివృద్ధికి సైతం యాదవులు అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఇవాళ హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవానికి సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాను ముఖ్యమంత్రిగా ఉండడానికి ముఖ్య కారణం యాదవ సోదరులు ఇచ్చిన భరోసా అని గుర్తుచేసుకున్న ఆయన, తెలంగాణ ఉద్యమంలో అంజన్ కుమార్ యాదవ్ పాత్ర మరపురానిదన్నారు. అంజన్ కుమార్‌ను గెలిపించి ఉంటే మంత్రి అయ్యి ఉండేవారని పేర్కొన్నారు.
'హైదరాబాద్లో విజయ్ డైయిరీ, హెరిటెజ్ డైయిరీ వచ్చింది. కానీ నగరంలో పేదవాడి నుంచి పెద్దోళ్ల వరకు పాలు కావాలన్నా వారి పిల్లలకు బలం కావాలన్నా యాదవుల సోదరులు పంచిన పాలే. పశుసంపదన పండగ పూట పూజించి పశుసంపదన కూడా దేవుళ్లతో సమానంగా పూజిస్తున్న యాదవులు సంస్కృతి దేశానికి ఆదర్శం. మూసీ అభివృద్ధికి సైతం యాదవులు అండగా నిలవాలి'-రేవంత్రెడ్డి, ముఖ్యమంత్రి
సీఎం రేవంత్రెడ్డి సదర్ స్టెప్పులు : సదర్ అంటే యాదవుల ఖదర్ అన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, యాదవులకు రానున్న రోజుల్లో పదవుల్లో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకునే యాదవులు ధర్మం వైపు నిలబడాలని కోరారు. ఇక నుంచి ఏటా ప్రభుత్వమే అధికారికంగా సదర్ ఉత్సవం నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. మూసీ ఆధ్వానంగా తయారైందని, అందుకే మూసీని ప్రక్షాళన చేసి పునరుద్ధరించి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ నగరం అభివృద్ధి చేయడం యాదవుల బాధ్యత కూడా అని ఉద్ఘాటించారు.