CM Revanth Met to Union Minister Khattar Over Hyderabad CSMP :హైదరాబాద్ సమగ్ర సీవరేజీ మాస్టర్ ప్లాన్‌ను(సీఎస్ఎంపీ) అమృత్ 2.0లో చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కలిశారు. చారిత్రక హైదరాబాద్ నగరంలో పురాతన మురుగుశుద్ధి వ్యవస్థనే ఉందని, అది ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేదని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. హైదరాబాద్ సమీప పురపాలక సంఘాల్లోనూ సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేదని కేంద్ర మంత్రి దృష్టికి ఆయన తీసుకెళ్లారు.
రూ.17 వేల కోట్లతో సీఎస్ఎంపీకి డీపీఆర్ : హైదరాబాద్‌లో ప్రజల జీవన ప్రమాణాలు ప్రపంచ స్థాయి నగరంలో మాదిరి ఉండాలంటే నగరంతో పాటు సమీప మున్సిపాలిటీల్లో 100 శాతం ద్రవ వ్యర్థాల శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ఖట్టర్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు సమీప 27 పురపాలక సంఘాలతో కలుపుకొని కలిపి 7,444 కి.మీ.మేర రూ.17,212.69 కోట్లతో సీఎస్ఎంపీకి డీపీఆర్ రూపొందించినట్లు ఖట్టర్‌కు సీఎం తెలిపారు. ఆ డీపీఆర్‌ను కేంద్ర మంత్రి ఖట్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సహాయం చేయడం లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.
హైదరాబాద్ నగరంలో 55 కి.మీ. మేర మూసీ నది ప్రవహిస్తోందని, ఇరువైపులా కలిపి 110 కి.మీ.మేర నగరంలోని మురుగు అంతా మూసీలోనే చేరుతోందని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇలా మురుగు మూసీలో చేరకుండా ఉండేందుకు ట్రంక్ సీవర్స్ మెయిన్స్, లార్జ్ సైజ్ బాక్స్ డ్రెయిన్స్, కొత్త సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.4 వేల కోట్లతో డీపీఆర్ రూపొందించినట్లు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి తెలిపారు. ఆ డీపీఆర్‌ను కేంద్ర మంత్రి ఖట్టర్‌కు రేవంత్ రెడ్డి సమర్పించారు. ఆ డీపీఆర్‌ను ఆమోదించడంతో పాటు పనుల అనుమతికి చొరవ చూపాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.