బీసీలకు జగన్ తీరని ద్రోహం- బ్యాక్‌బోన్ అని కీర్తిస్తూనే వెన్నుపోటు CM Jagan Cheated BC:బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామంటూ గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ నిధులు, విధులే కాదు కనీసం కూర్చునేందుకు కుర్చీలు కూడా లేని ఉత్తుత్తి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఐదేళ్లలో ఒక్కరికీ రాయితీ రుణాలు ఇప్పించలేకపోయారు. కానీ కార్పొరేషన్ ఛైర్మన్ కుర్చీల్లో కూర్చున్న వైఎస్సార్సీపీ నాయకుల జీతభత్యాల కింద 40 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పందేరం చేశారు.
తెలుగుదేశం హయాంలో బీసీలకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా లక్ష నుంచి పాతిక లక్షల వరకూ 50శాతం రాయితీతో రుణాలు అందించారు. నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచే రుణాలకు రూ.1,626 కోట్లు ఖర్చు చేశారు. బ్యాంకు వాటాతో కలిపితే రూ. 2వేల 400కోట్లు ఖర్చు పెట్టారు. తద్వారా లక్షల మంది బీసీలకు ఉపాధి కల్పించారు. జగన్ ఐదేళ్ల పాలనలో రేషన్ వాహనాల కొనుగోళ్లకు మాత్రమే రూ.132 కోట్ల రాయితీ రుణాలిచ్చారు.
బ్యాంకు వాటా కూడా కలిపితే మొత్తం 200 కోట్ల రూపాయలే అందించగలిగారు. లబ్ధిపొందింది కూడా 3,800 మంది మాత్రమే. అంటే జగన్ జమానాలోబీసీ కార్పొరేషన్లు జగన్ అనుచరులు, వైఎస్సార్సీపీ నాయకుల రాజకీయ పునరావాసానికే తప్ప ఆయావర్గాలకు పెద్దగా ఉపయోగపడలేదు. ఇక బీసీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలైన ఎంబీసీలకూ జగన్ మొండి చేయే చూపించారు. టీడీపీ ప్రభుత్వం 2016లో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటుచేసి 90శాతం సబ్సిడీ రుణాలు అందించింది. 21,711 మందికి రూ.84 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. జగన్ ఏలుబడిలో అవేమీలేవు.
కర్నూలు లోక్‌సభ బరిలో బీసీ అభ్యర్థులు - రసవత్తరంగా పోరు - kurnool loksabha
కులవృత్తుల్నే నమ్ముకున్న బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వం వెన్నెముకగా నిలిచింది. ఆదరణ పథకాన్ని తెచ్చింది. దాని ద్వారా 17 రకాల కులవృత్తులకు ఆధునిక పనిముట్లు అందించింది. 10 వేల నుంచి 30 వేల రూపాయల విలువైన పరికరాలను 90 శాతం రాయితీతో ఇచ్చింది. గీతకార్మికులు, మేదర, శిల్పి తదితర వర్గాల వారికి ప్రత్యేకంగా 5వేల రూపాయల నగదుతోపాటు సైకిల్ కూడా ఇచ్చారు. రజకులకు ఇస్త్రీ పెట్టెతోపాటు రూ.10 వేల నగదు ఇచ్చారు.
మత్స్యకారులకు పడవలు, వలలు పంపిణీ చేశారు. చేనేతలకు జాకార్డు మిషన్, ఇతర పరికరాలు ఇచ్చారు. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్, హెయిర్ కటింగ్ దుకాణాల్లో ఉపయోగించే కుర్చీ, ఇతర పరికరాలు, కుట్టు మిషన్లు, రాళ్లు పగులగొట్టే యంత్రాలు, ఇత్తడి పనిలో ఉపయోగపడే పరికరాలు, చెక్కపని చేసేందుకు వినియోగించే ఆధునిక పరికరాలు ఇలా 215 రకాల పనిముట్లు అందించారు.
తెలుగుదేశం ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే 3లక్షల 48వేల 837 మంది బీసీలకు ఆధునిక పరికరాలు అందించేందుకు రూ.377 కోట్లు ఖర్చు చేసింది. జగన్ ఆదరణ పథకాన్ని ఆపేయకుండా కొనసాగించి ఉంటే ఐదేళ్లలో 17న్నర లక్షలమంది బీసీలకు మేలు జరిగేదే.! అది ఇష్టంలేని జగన్ ఆదరణ పథకాన్ని నిరాదరణకు గురి చేశారు. పింఛన్లు, ఉపకార వేతనాలు, బోధనా రుసుములు, వడ్డీ రాయితీ, చేయూత పథకాలనూ బీసీ సంక్షేమంగా చెప్పుకుంటూ మభ్యపెడుతున్నారు.
జగన్ అధికార దాహానికి నాడు దళిత బిడ్డ - నేడు బీసీ బిడ్డ బలి : వడ్డెర సంఘం నాయకులు - Vaddera Leaders fire on ycp govt
బీసీ ఉపప్రణాళిక నిధుల వినియోగంపైనా జగన్ మాయాజాలం చేశారు. బీసీల అభివృద్ధి, వారికి మౌలిక వసతులు అందుబాటులోకి తేవడం, వారి కోసమే ప్రత్యేకంగా అమలు చేసే పథకాలకు నిధులు వినియోగించడం ఉపప్రణాళిక చట్టం లక్ష్యం. కానీ జగన్ ఏటా బడ్జెట్ నుంచి బీసీ ఉపప్రణాళిక కింద నిధులు కేటాయించినట్లు చూపిస్తూ వాటిని వారి అభివృద్ధికి వినియోగించలేదు. అందరికీ వర్తించే పథకాలకే మళ్లించారు. వాటినే ఉపప్రణాళిక నిధులుగా చూపించారు.
మరే ముఖ్యమంత్రీ బీసీలను ఇంత దారుణంగా వంచించలేదు. ఇలా మళ్లించడమే కాదు. ఏటా ఉపప్రణాళిక కింద కేటాయించిన నిధుల్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించకుండా మురిగిపోయేలా చేశారు. బీసీల కులగణన చేస్తామని మ్యానిఫెస్టోలో మాటిచ్చిన జగన్ గతేడాది నవంబరు నుంచి ఇదిగో అదిగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేశారు. ఎన్నికల ముందు ప్రచారాస్త్రంగా వినియోగించుకునేందుకు చివరికి ఫిబ్రవరిలో సర్వే నిర్వహించినా దాన్ని బయటపెట్టలేదు. ఇదీ బీసీలపై జగన్‌కు ఉన్న ఉత్తుత్తి ప్రేమ.