Boxing Day Test 2024 2024 Steve Smith Bumrah : బోర్డర్- గావస్కర్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతోంది. మొదటి టెస్టు టీమ్‌ఇండియా గెలవగా, రెండో టెస్టు ఆసీస్ సొంతం చేసుకుంది. మూడో టెస్టులో ఆస్ట్రేలియా పైచేయి సాధించినట్లు కనిపించినా, చివరికి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. కీలక నాలుగో టెస్టు డిసెంబరు 26న మెల్‌బోర్న్‌లో మొదలవుతుంది. ఈ బాక్సింగ్ డే టెస్టు (Boxing Day Test)కు టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా సిద్ధమవుతున్నాయి.
అయితే ఈ టెస్టులో రెండు టీమ్‌లకు చెందిన కొందరు ఆటగాళ్లు అరుదైన రికార్డులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్ కీలక బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కి ఈ అవకాశం ఉంది.
స్మిత్ ఖాతాలో పది వేల పరుగులు?
ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ పది వేల టెస్టు పరుగులకు చేరువలో ఉన్నాడు. 191 పరుగులు చేస్తే సరిపోతుంది. ఈ రికార్డు సాధించిన నాలుగో ఆస్ట్రేలియా బ్యాటర్‌గా నిలుస్తాడు. అతడి కంటే ముందు అలన్ బోర్డర్, స్టీవ్ వా, రికీ పాంటింగ్ మాత్రమే పది వేల పరుగులు చేశారు. మూడో టెస్టులో సెంచరీ చేసిన స్మిత్ ఫామ్ అందుకున్నట్లు కనిపిస్తోంది. ఇదో జోరు కొనసాగిస్తే 191 పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాదు.
సూపర్ ఫామ్‌లో బుమ్రా
ఈ సిరీస్‌లో జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడు. బాక్సింగ్ డే టెస్టులో మరో ఆరు వికెట్లు తీస్తే 200 టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల సరసన చేరుతాడు. ఇప్పటి వరకూ ఈ రికార్డును ఐదుగురు భారత పేసర్లు మాత్రమే అందుకున్నారు. ఈ జాబితాలో కపిల్ దేవ్, ఇషాంత్ శర్మ, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, మహ్మద్ షమీ మాత్రమే ఉన్నారు. మొత్తంగా స్పిన్నర్‌లతో కలిపి 11 మంది భారత బౌలర్లు ఈ రికార్డు అందుకున్నారు. బుమ్రా ఫామ్ ఆధారంగా చూస్తే, నాలుగో టెస్టులోనే బుమ్రా ఈ మైల్‌స్టోన్‌ను అందుకునే అవకాశం ఉంది.