CM Jagan Attack Case Accused Durga Rao Release : సీఎం జగన్ మోహన్ రెడ్డిపై గులకరాయితో దాడి కేసులో శనివారం రాత్రి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తమ అదుపులో ఉన్న టీడీపీ నాయకుడు వేముల దుర్గారావును ఎట్టకేలకు పోలీసులు విడిచిపెట్టారు. ఆయన ఆచూకీ చెప్పాలంటూ నాలుగు రోజులుగా పోలీసు అధికారులను వేడుకుంటున్నా కనికరించకపోవడంతో సోమవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ (Habeas Corpus Petition) దాఖలుకు న్యాయవాది సలీం ప్రయత్నాలు ప్రారంభించారు.
అవసరమైతే రావాల్సిందే : దుర్గారావు కుటుంబ సభ్యులు, వడ్డెరకాలనీ వాసులు శనివారం ఉదయం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. "ఎన్నిసార్లు వేడుకున్నా కనికరంలేదా? నా భర్త ఎక్కడ ఉన్నాడో చూపించండి" అంటూ దుర్గారావు భార్య శాంతి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. చివరకు శనివారం రాత్రి విజయవాడ నార్త్ ఏసీపీ కార్యాలయంలో దుర్గారావును కుటుంబ సభ్యులకు అప్పగించారు. 160 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చిమళ్లీ అవసరమైతే స్టేషన్‌కు పిలుస్తామని చెప్పి సంతకాలు తీసుకున్నారు.
దుర్గారావు ఎక్కడ? - సీపీ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన - Durga Rao Family Protest
సీపీ కార్యాలయం వద్ద దుర్గారావు భార్య కన్నీటి పర్యంతం :దుర్గారావు ఆచూకీ విషయమై శనివారం ఉదయం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట దుర్గారావు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కమిషనర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు దాదాపు 60 మంది వడ్డెర కులస్థులు సీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరి నేతృత్వంలో మహిళా పోలీసులు వారిని చుట్టుముట్టారు. రోడ్డుపై నిరసనలకు వీల్లేదంటూ భయపెట్టేందుకు ప్రయత్నించారు. మీడియాతో మాట్లాడుతున్న మహిళలను, సంఘ పెద్దలను పోలీసులు ఉక్కిరిబిక్కిరి చేశారు.
నాలుగు రోజులుగా దుర్గారావును ఎక్కడ దాచి ఉంచారని మహిళలు ప్రశ్నించారు. కష్టపడి పనిచేసుకుని బతికే తమను రోడ్డు పైకి ఈడ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధం లేని కేసుల్లో వడ్డెరలను ఇరికిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. మహిళలను, వడ్డెర నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమైనా పరిస్థితి సంక్లిష్టంగా మారడంతో వెనక్కి తగ్గారు. "నా భర్త ఎక్కడ ఉన్నాడో చూపించండి" అంటూ వేముల దుర్గారావు భార్య శాంతి, ఇతర మహిళలతో కలిసి భీష్మించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని బలవంతంగా ఆటోల్లో డీసీపీ కార్యాలయానికి తరలించారు. అనంతరం వారు టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ శ్రీహరికి వినతిపత్రం అందించారు.