Civil Engineer Lost One Crore Rupees in Cyber Fraud : స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు రూ.2 వేల శాతం లాభాలు ఇప్పిస్తానని హైదరాబాద్‌కు చెందిన సివిల్ ఇంజినీర్‌ను బురిడీ కొట్టించి సైబర్ నేరగాళ్లు రూ.కోటి కొల్లగొట్టారు. నకిలీ యాప్‌ను నమ్మి రూ.50 వేల పెట్టుబడితో మొదలుపెట్టిన బాధితుడు, వర్చువల్‌గా కనిపించే లాభాలు నిజమేనని భావించి నేరగాళ్లకు సొమ్ము బదిలీ చేశాడు. మొత్తం రూ.9.3 కోట్లు లాభం వచ్చినట్లు యాప్‌లో చూపించినా, విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
శేరిలింగంపల్లికి చెందిన సివిల్ ఇంజినీర్ సెప్టెంబర్ రెండో వారంలో సోహైల్ రాజ్‌పుత్ పోర్ట్ ఫోలియో షేరింగ్ పేరుతో ఉన్న వాట్సప్ గ్రూప్‌లో చేరాడు. రాహుల్ పేరుతో పరిచయం చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి, ట్రేడింగ్ నైపుణ్యాలు నేర్పిస్తామని నమ్మించాడు. స్టాక్ మార్కెట్లో తాము చెప్పినట్లు పెట్టుబడులు పెడితే రూ. 2 వేల శాతం లాభం ఉంటుందని ఆశ పెట్టాడు. మోర్గాన్ స్టాన్లీ ఇన్‌స్టిట్యూషనల్ అకౌంటింగ్‌కు అనుబంధంగా ఉన్న ఈ ట్రేడ్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. సివిల్ ఇంజినీర్‌కు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సెప్టెంబరు 25న రూ.50 వేలు పెట్టుబడి పెట్టాడు.
రెండు సార్లు రూ.3.9 లక్షలు విత్‌డ్రాకు అవకాశం :ఆ తర్వాత ప్రొఫెసర్ లూసీ పేరుతో పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి, ప్రతి రోజూ షేర్లు కొనుగోలు చేయాలని సూచించాడు. ప్రముఖ కంపెనీల పేరుతో షేర్లు కొనుగోలు చేయిస్తున్నట్లు నమ్మించి ప్రతిసారి రూ.లక్షల్లో బదిలీ చేయించుకునేవారు. సివిల్ ఇంజినీర్‌తో మరింత పెట్టుబడి పెట్టించేందుకు రెండుసార్లు రూ.3.9 లక్షలు విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కొంత మొత్తం రావడంతో బాధితుడు నిజంగానే డబ్బు వస్తుందని ఆశపడి, నవంబర్ 4వ తేదీ వరకూ రూ.కోటి పెట్టుబడి పెట్టాడు.