Vivaha Prapti Program Cancel in Chilkur Temple :రంగారెడ్డి జిల్లా శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించాల్సిన కల్యాణోత్సవంలోని ‘వివాహ ప్రాప్తి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ప్రకటించారు. శుక్రవారం గరుడ ప్రసాదం పంపిణీలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రంగరాజన్ వెల్లడించారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు, తమ ఇళ్లలోనే దేవుడిని ప్రార్థించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఆదివారం సాయంత్రం నిర్వహించాల్సిన కల్యాణోత్సవం యధావిధిగా జరుగుతుందన్నారు.
"రేపు చిలుకూరు బాలాజీ కల్యాణోత్సవం నిర్వహిస్తాము. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అందరికీ సంతాన ప్రాప్తి కలగాలని, వివాహం ఆలస్యమైన వాళ్లకు పెళ్లి జరగాలని గరుడ ప్రసాదం కోసం నిన్న, వివాహ ప్రాప్తి కోసం రేపు భక్తులంతా వేడుకల్లో పాల్గొనాలని కోరాము. అయితే శుక్రవారం భక్తుల తాకిడిని చూసిన తర్వాత, వారు పడిన ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని రేపటి వివాహ ప్రాప్తిని రద్దు చేయటం జరిగింది. పెళ్లి కాని వారు ఇళ్లలో నుంచే దేవుడిని ప్రార్థించండి." - రంగరాజన్, బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు
Chilkur Balaji Temple Traffic Issue :హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన గరుడ ప్రసాద వితరణ భక్తులు, సామాన్యులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. ప్రసాద వితరణ ప్రదేశం వద్ద తొక్కిసలాట చోటుచేసుకోవడంతో 50 మందికి పైగా భక్తులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. పోలీసులు వారిని అతి కష్టం మీద బయటకు తెచ్చి, అంతేకష్టంగా అంబులెన్స్‌లలో ఆసుపత్రులకు తరలించారు.