AP CM Chandrababu Naidu on Madanapalle Incident :అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్లు దహనం ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తక్షణమే డీజీపీ, సీఐడీ చీఫ్‌లు ఘటనాస్థలికి వెళ్ళాలని ఆదేశించారు. కీలకమైన ఫైళ్లు అగ్నికి ఆహుతి కావడం ప్రమాదమా? లేదా కుట్రపూరితమా అనే కోణంలో విచారణ జరుపుతూ ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఇతర ఉన్నతాధికారులు హుటాహుటిన మదనపల్లికి చేరుకుని విచారణ చేపట్టారు.
అసెంబ్లీ సమావేశాలతో బిజిబిజిగా ఉన్నా, మదనపల్లి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం, మధ్యాహ్నం రెండుసార్లు సమీక్ష నిర్వహించారు. సీఎస్, సీఎంఓ అధికారులు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయ్యాయి అనే సమాచారం రావటంతో సీసీ ఫుటేజ్ పూర్తి వివరాలు బయటకు తీయాలని అయన ఆదేశించారు. వెనువెంటనే ఘటపై జిల్లా కలెక్టర్‌తో సీఎం ఫోన్లో మాట్లాడారు. రాత్రి 11.24 ప్రమాదం జరిగినట్లు జిల్లా అధికారులు వివరించారు. ఘటనపై జిల్లా అధికారుల సత్వర స్పందన లేకపోవడంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.
గౌతమ్ అనే ఉద్యోగి ఆదివారం రాత్రి 10.30 గంటలకు వరకు కార్యాలయంలో ఉన్నందున, ఆదివారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ సమయం వరకు ఉండడానికి కారణాలు తెలుసుకోవాలని సీఎం ఆదేశించారు. నేరాలు చేసి సాక్ష్యాలు చెరిపివేయడంలో ఆరితేరిన వ్యక్తులు మొన్నటి వరకు అధికారంలో ఉన్నారని సీఎం అన్నారు. గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలు అధికారులు మరిపోకూడదని, ఆ కోణంలో లోతుగా దర్యాప్తు జరపాలని సీఎం ఆదేశించారు. ఘటనపై మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనే వివరాలు సమగ్రంగా తన ముందు ఉంచాలని తెలిపారు.