Changes In Free Sand Policy In AP : ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుకపై సమీక్షించిన సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉచిత ఇసుక విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అవసరాలకు రీచ్‌ల నుంచి గతంలో ఎడ్లబండ్ల ద్వారానే ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి ఉండేది. ప్రస్తుతం రీచ్‌ల నుంచి ఎడ్లబండ్లతో పాటు ట్రాక్టర్లలో కూడా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇసుక విధానంలో మార్పులు తీసుకువచ్చింది. ఈ మేరకు గనులశాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
జరిమానాలు ఉండవు :అదే విధంగా ఉచిత ఇసుకకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం సైతం తీసుకుంది. ఇసుకపై సీనరేజ్ వసూళ్లు కూడా ఎత్తివేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. లారీల్లో 40 టన్నులకు మించి ఉన్నా అధిక లోడ్ జరిమానాలు ఉండవని సీఎం తెలిపారు. ఉచిత ఇసుకపై టీడీపీ ప్రజాప్రతినిధుల భేటీలో ఈ మేరకు సీఎం కీలక ప్రకటన చేశారు.
ఇసుక తవ్వకాలకు అనుమతులు : ఇటీవల పట్టా భూముల్లో కూడా ఇసుక తవ్వకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పట్టా భూములతో పాటు, డీకేటీ భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పట్టా, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించిన గైడ్ లైన్స్‌ను జారీ చేస్తూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే.