Chandrababu on Inheritance :వారసత్వంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో వారసత్వం ఓ మిథ్యన్నఆయన అవకాశాలు అందిపుచ్చుకున్నవారే ఏ రంగంలోనైనా రాణిస్తారని స్పష్టం చేశారు. లోకేశ్‌కు వ్యాపారం అయితే తేలికన్న చంద్రబాబు కానీ సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. దేశానికి నాలుగోసారీ మోదీయే ప్రధాని అవుతారని పేర్కొన్నారు. కేంద్రమంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. విధ్వంసానికి గురైన ఏపీని తిరిగి నిలబెట్టడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. జగన్ హయాంలో అవినీతి, అక్రమాలపై చట్టపరంగానే చర్యలు ఉంటాయని ఎక్కడా కక్షసాధింపు ఉండబోదని వెల్లడించారు.
దావోస్ పర్యటనలో భాగంగా ఇండియా టుడే, బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం ఏ రంగమైనా వారసత్వం అనేది మిథ్యని వ్యాఖ్యానించారు. సీఎం, పార్టీ అధినేతగా లోకేశ్ వారసత్వంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటాయని చెప్పారు. ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరని అన్నారు.
Chandrababu on Lokesh : తానెప్పుడూ జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదని చంద్రబాబు పేర్కొన్నారు. 33 ఏళ్ల క్రితం కుటుంబ వ్యాపారం ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ఆ వ్యాపారం అయితే లోకేశ్‌కు చాలా తేలికైన పని అన్న ఆయన కానీ లోకేశ్ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. అందులో సంతృప్తి పొందుతున్నారని ఇందులో వారసత్వమంటూ ఏమీ లేదని చంద్రబాబు వివరించారు.
కేంద్రమంత్రి కావాలనే ఉద్దేశం తనకు లేదని చంద్రబాబు తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందని అందుకే ప్రజలు ఎన్డీయే ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని దానికి కేంద్రం ఎంతో సాయం చేస్తోందని వివరించారు. గుజరాత్‌లో ఐదుసార్లు వరుసగా బీజేపీ గెలిచిందన్న సీఎం దీంతో అభివృద్ధి, సంక్షేమం పెద్దఎత్తున జరిగిందన్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యారని నాలుగోసారి కూడా ఆయనే ప్రధాని అవుతారని విశ్వాసం వ్యక్తంచేశారు.