Chandrababu on Industries :రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అమరావతి సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పరిశ్రమల శాఖపై ఆ శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎంతమంది యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించారన్నది ముఖ్యమని సీఎం వ్యాఖ్యానించారు. అమరావతి తరహాలోనే పరిశ్రమలకు భూములిచ్చే అంశంలో స్థానిక రైతులను కూడా భాగస్వాములను చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
ఆర్సెలార్ మిట్టల్ పరిశ్రమ, రామాయపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ ఇలా వేర్వేరు పరిశ్రమలకు భూమి అవసరమని చంద్రబాబు తెలిపారు. వివిధ రంగాల్లో ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలను ఎన్యూమరేషన్ చేయించే పని త్వరితగతిన పూర్తి కావాలని ఆదేశించారు. ఒక పరిశ్రమ తయారు చేసిన ఉత్పత్తి మరో పరిశ్రమకు ముడి సరుకు అవుతుందని చంద్రబాబు వెల్లడించారు.
ఈ క్రమంలోనే 20 లక్షల ఉద్యోగాల కల్పనపై కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశారని మంత్రి లోకేశ్ తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలోనూ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి పెట్టుబడి విషయంలోనూ కలెక్టర్లు జాగ్రత్తగా డీల్ చేయాలని సూచించారు. ఆర్సెలార్ మిట్టల్‌కు ఎన్ఎండీసీ ముడి ఇనుము ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. పైప్ లైన్ ద్వారా ముడి ఇనుము ఖనిజం వచ్చేలా చేయాలని కోరుతున్నారని లోకేశ్ వివరించారు.