Income tax relief in Budget 2025 : మోదీ 3.O ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రవేశ పెట్టనున్న వార్షిక బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తక్కువ ఆదాయం గల వారికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉపశమనం కల్పించేలా ప్రకటనలు చేయొచ్చని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పాత, కొత్త పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. అయితే గత కొన్ని బడ్జెట్ల్ల్లో పాత పన్ను విధానంలో పెద్దగా మార్పులు చేయని కేంద్రం, కొత్త పన్ను విధానంలో సవరణలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఈసారి కూడా జీరో ట్యాక్స్ శ్లాబును పెంచే అవకాశాలున్నట్లు కథనాలు తెలిపాయి.
ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షలదాకా వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్నులూ లేవు. రూ.3-7 లక్షల మధ్య ఉంటే 5శాతం పన్ను ఉంటుంది. అయితే కేంద్రం ఆ పన్నుశాతాన్ని తగ్గించే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆధికారిక సమాచారం లేదు. కానీ, ఈ మార్పులు కేవలం ఆదాయం వచ్చే వారికే ఉంటుందని సమచారం. ఎక్కువ ఆదాయం పన్ను శాతాల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని కథనాల్లో పేర్కొన్నాయి.
2024-25 బడ్జెట్‌లో మార్పులు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్‌లో కొత్త పన్ను విధానానికి సంబంధించి కొన్ని మినహాయింపుల్ని ప్రకటించారు.
- ఉద్యోగులు, పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.50వేల నుంచి రూ.75వేలకు పెంపు.
- ఫ్యామిలీ పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.15వేల నుంచి రూ.25వేలకు పెంపు.
- ప్రైవేట్ రంగ ఉద్యోగులకు సంస్థలు చేసే ఎన్‌పీఎస్ విరాళాలపై డిడక్షన్ 10 శాతం నుంచి 14 శాతానికి పెంపు.
ప్రస్తుతం కొత్త శ్లాబులు :
ఆదాయం(రూ.) | పన్ను శాతం |
---|---|
0-రూ.3 లక్షలు | 0 |
3-7 లక్షలు | 5 |
7-10 లక్షలు | 10 |
10-12 లక్షలు | 15 |
12- 15 లక్షలు | 20 |
15 లక్షల పైన | 30 |
పాత పన్ను విధానం శ్లాబులు : పాత ఆదాయపు పన్ను విధానంలో సెక్షన్ 80 కింద అనేక పన్ను మినహాయింపులు, తగ్గింపులు ఉన్నాయి. దీని వల్ల ట్యాక్స్ పేయర్స్‌కు పన్ను భారం తగ్గుతుంది.
ఆదాయం (రూ.) | పన్ను శాతం |
---|---|
0-2.5 లక్షలు | 0 |
2.5-5 లక్షలు | 5 |
5-10 లక్షలు | 20 |
10 లక్షల పైన | 30 |