Dry Fruits Should be Soaked or Not: ప్రస్తుతం జనాల్లో క్రమంగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెరుగుతోంది. ఇందులో భాగంగానే చాలా మంది డ్రై ఫ్రూట్స్‌ను తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే, వీటిని నానబెట్టి తినాలా? లేక నేరుగానే తినాలా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. కొందరేమో డ్రై ఫ్రూట్స్‌ని రాత్రంతా నానబెట్టి తీసుకోవాలని అంటారు. మరికొందరేమో నానబెట్టకుండానే తినమని సలహా ఇస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అసలు డ్రై ఫ్రూట్స్‌ను ఎలా తింటే లాభమో నిపుణులు చెబుతున్నారు. ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవడం వల్ల శరీరం వేగంగా పోషకాలను గ్రహిస్తుందని నిపుణులు అంటున్నారు. 2020లో Nutrients జర్నల్‌లో ప్రచురితమైన "Soaking and germination improve nutritional and bioactive compounds in dry fruits" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. ఇంకా పచ్చి వాటితో పోలిస్తే నానబెట్టిన గింజలు తీసుకోవడం వల్ల తేలికగా జీర్ణం అవుతాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా గ్యాస్, అజీర్తి సమస్యలు దరిచేరవని అంటున్నారు. రాత్రంతా నీళ్లలో నానబెట్టిన నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. వీటితో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గుతుందని వివరిస్తున్నారు.
సాధారణ గింజల కంటే నానబెట్టిన గింజల్లో కేలరీల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రెండిట్లో పోషకాలు అన్నీ సమానంగానే ఉన్నా.. నానబెట్టిన గింజలతో లాభం కాస్త ఎక్కువగానే ఉంటుందని తెలిపారు. నీళ్లను పీల్చుకున్న గింజల్లో రుచి ఎక్కువగానే ఉంటుందని అనేక అధ్యయనాల్లో తేలిందని పేర్కొన్నారు. బాదం, ఎండు ద్రాక్ష, వాల్నట్, జీడిపప్పు, పిస్తా వంటి వాటిని నానబెట్టి తీసుకోవడమే ఉత్తమమని వివరిస్తున్నారు.
జీడిపప్పు: జీడిపప్పును బాదంలాగే నానబెట్టాకే తినాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే సులువుగా జీర్ణమవుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, మినరల్స్.. శరీరానికి సమృద్ధిగా అందాలంటే తప్పనిసరిగా నానబెట్టాలని సూచిస్తున్నారు.
వాల్‌నట్స్: వీటిని నానబెట్టి తింటే ఇందులోని ఎంజైమ్‌లు కొవ్వులు, ప్రొటీన్లను విడగొట్టి, తేలిగ్గా జీర్ణమయ్యేలా చేస్తాయని చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా లభించే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు.. గుండె, మెదడు ఆరోగ్యానికి సాయం చేస్తాయని వివరిస్తున్నారు.
రెజిన్లు: వీటినీ నానబెట్టిన తరవాత తీసుకుంటేనే అందులోని చక్కెరలు, న్యూట్రియంట్లు విడుదలవుతాయని చెబుతున్నారు. అంతే కాకుండా వాటిల్లోని పోషకాలు శరీరానికి అందాలన్నా... జీర్ణప్రక్రియకు అడ్డుపడకూడదన్నా వాటినీ నానబెట్టాకే తినాలని వివరిస్తున్నారు.
పిస్తా: వీటిని నానబెడితే వాటిల్లోని సంక్లిష్ట చక్కెరలు విడిపోయి త్వరగా జీర్ణమవుతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి, తినేముందు కొన్ని గంటలపాటు నీటిలో వేసి నానబెట్టడం మంచిదని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ పాదాలు పగిలిపోయాయా? రాత్రి ఇది పెట్టుకుంటే పగుళ్లు మాయం!
నిద్ర మంచిదని ఎక్కువ సమయం పడుకుంటున్నారా? ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?