Medigadda Barrage Certificate Issue : మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. దీనిని పొరపాటుగా భావించాలని సంబంధిత ఇంజినీర్లు వివరణ ఇచ్చారని సీఈ రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగినా, ఆనకట్టల ప్రారంభం జరిగిన కొద్ది కాలానికే సీపేజీ సమస్య వచ్చినా చర్యకు ఉపక్రమించని నీటిపారుదల శాఖ విజిలెన్స్ నివేదికతో స్పందించింది.
Medigadda Damage Updates :మేడిగడ్డ ఆనకట్టపై ఫిబ్రవరి 13న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ముఖ్యమంత్రి సమక్షంలో ప్రజంటేషన్ ఇచ్చిందని గత నెలలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్), కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్(రామగుండం)కు లేఖ రాశారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌తో సహా పలు వైఫల్యాలను సీఎం ఎత్తి చూపారని తెలిపారు. 2019-20లోనే నిర్వహణ సమస్యలు తలెత్తి సీసీ బ్లాకులు పక్కకు వెళ్లిపోయాయని చెప్పారు. 2019 నవంబర్‌లోనే గుర్తించిన సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో సమస్యలు తలెత్తాయని లేఖలో పేర్కొన్నారు.
గుత్తేదారుకు ఒకవైపు గడువు పొడిగిస్తూ, ఇంకోవైపు ఆ గడువులోగానే నిర్మాణం పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇచ్చారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో వెల్లడైందని లేఖలో తెలిపారు. దీనిపై ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని, సమస్య తీవ్రత దృష్ట్యా వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్), కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్(రామగుండం)కు లేఖలో వివరించారు.