Hydra Commissioner Ranganath Key Comments : హైదరాబాద్ మహానగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే వారిలో పేదల కంటే ధనవంతులు, సంపన్నులే ఎక్కువగా కనిపిస్తున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యానించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా ఆక్రమణదారుల్లో ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఎవరిని ఉపేక్షించేదని లేదని రంగనాథ్ హెచ్చరించారు. బేగంపేటలోని ఓ హోటల్లో జాతీయ బయోడైవర్సిటీ అథారిటీ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్మెంటల్ ఇనీషియేటివ్ ఆధ్వర్యంలో అర్బన్ బయోడైవర్సిటీ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా చెరువుల పరిరక్షణ, పునరుద్దరణ చర్యలపై ఎక్కువగా దృష్టి పెట్టామన్న రంగనాథ్, లోటస్ పాండ్లో ఏకంగా ఓ వ్యక్తి ఎకరం స్థలం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే హైడ్రా అడ్డుకుందన్నారు. త్వరలోనే హైడ్రాకు పోలీస్ స్టేషన్ రాబోతుందని, హైడ్రాకు వచ్చే ఫిర్యాదులను వెనువెంటనే పరిశీలించి చర్యలు తీసుకోనున్నట్లు రంగనాథ్ వివరించారు. హైడ్రా చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని, అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో కోర్టు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయని రంగనాథ్ వెల్లడించారు.
"ఎక్కువగా సంపన్నులే సర్కార్ స్థలాలను ఆక్రమిస్తున్నారు. ఆక్రమణలకు గురైన స్థలాల్లో పేదలకంటే ధనికులే అధిక శాతంగా ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలవారు ఈ ఆక్రమణల్లో భాగంగా ఉన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎవరినీ వదలిపెట్టే ప్రశక్తేలేదు. హైడ్రాకు వచ్చే కంప్లైంట్లను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటాం" -రంగనాథ్, హైడ్రా కమిషనర్
అక్రమనిర్మాణల కూల్చివేతపై కోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నాయి : చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణ.. అక్కడ నిర్మాణాలు చేపట్టరాదని, చేపడితే వాటిని కూల్చి వేయవచ్చునని కోర్టు తీర్పులు ఎంతో స్పష్టంగా ఉన్నాయన్నారు. అలాగే రహదారులు, పార్కులు, ప్రజావసరాలకోసం కేటాయించిన స్థలాలు ఆక్రమణలు కాకూండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా కోర్టులు చక్కటి దిశానిర్దేశం చేశాయని తెలిపారు. ఇందుకు ఇటీవల హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పులే నిదర్శనమని వ్యాఖ్యానించారు. జీవవైవిధ్యానికి ఊతమిచ్చేలా చెరువుల పరిరక్షణలో హైడ్రా చేస్తున్న కృషిని నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఛైర్మన్ అచలేందర్ రెడ్డి అభినందించారు.
అయోమయంలో హైడ్రా - చెరువులు, కుంటల లెక్క తెలియక సందిగ్ధం
కొన్నిసార్లు మనుసును చంపుకొని పని చేయాల్సి వస్తోంది : రంగనాథ్