Central Govt Focus On Tribal Areas : గిరిజనుల సామాజిక, ఆర్థికాభివృద్ధిపై కేంద్రం దృష్టిసారించింది. ఏజెన్సీలు, మైదాన ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాల పరిధిలో 4జీ సర్వీసులు, అన్ని గ్రామాలకు వంద శాతం విద్యుదీకరణ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 500 జనాభా దాటిన దాదాపు 924 గిరిజన ఆవాసాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేపట్టనుంది. దీనికి రాష్ట్ర నిధులు లేకుండా కేంద్రమే మొత్తం నిధులు కేటాయిస్తుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న పీఎం జనజాతి ఆదివాసీ న్యాయమహా అభియాన్‌ను ఉన్నతీకరించి ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్‌గా మార్చింది.
రానున్న ఐదేళ్ల కాలంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లోని గిరిజనుల సామాజిక, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ పథకం కింద ఐదేళ్లలో దేశవ్యాప్తంగా రూ.79,156 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. పథకం వివరాలను ముసాయిదా రూపంలో ప్రకటించింది. ఇందులో భాగంగా 17 మంత్రిత్వశాఖలు ఆయా ప్రాజెక్టులు చేపట్టనున్నాయి. రాష్ట్రంలో ఈ పథకం అమలు కోసం నాలుగు కమిటీలు వేయాలని కేంద్రం తెలిపింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అపెక్స్ కమిటీ పథకం అమలును పర్యవేక్షిస్తుంది. దీంతో పాటు రాష్ట్ర, జిల్లా, మండలస్థాయుల్లో కమిటీలు మౌలిక సదుపాయాలు, ఇతర పనుల ప్రతిపాదనల్ని నోడల్ విభాగమైన గిరిజన సంక్షేమశాఖ ద్వారా పంపించనున్నాయి. పీఎం జుగా కార్యక్రమాలకు ప్రత్యేక విధివిధానాలు త్వరలో జారీ చేస్తామని వెల్లడించింది. గిరిజన జీవన పర్యాటకం కోసం స్వదేశీదర్శన్ పేరిట నూరు శాతం నిధులతో హోం స్టే గృహాలు నిర్మించనున్నట్లు పేర్కొంది.