ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సొంత రాష్ట్రాలకు వెళ్లండి' - ఆమ్రపాలి, రొనాల్డ్ రోస్ సహా పలువురి అభ్యర్థనలు తోసిపుచ్చిన కేంద్రం

పలువురు ఐఏఎస్​, ఐపీఎస్​లకు డీఓపీటీ షాక్ - కేడర్ మార్పు కోసం చేసుకున్న విజ్ఞప్తులు తిరస్కరణ

rejected the requests of IAS and IPS
rejected the requests of IAS and IPS (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2024, 5:55 PM IST

Updated : Oct 10, 2024, 6:08 PM IST

CENTRAL GOVT IAS AND IPS CADRE: ఏపీ తెలంగాణల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (డీఓపీటీ) షాక్ ఇచ్చింది. కేడర్ మార్పు కోసం చేసుకున్న విజ్ఞప్తులను తిరస్కరించింది. 13 మంది అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చిన కేంద్రం, తాము గతంలో కేటాయించిన రాష్ట్రానికే వెళ్లాలని స్పష్టం చేసింది.

ఐఏఎస్‌ అధికారులు వాకాటి కరుణ, రోనాల్డ్‌ రోస్‌, ఆమ్రపాలి, వాణీప్రసాద్‌, మల్లెల ప్రశాంతితో పాటు ఐపీఎస్‌లు అంజనీ కుమార్‌, అభిషేక్‌ మొహంతి తదితరులు తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. అయితే, వారి అభ్యర్థనను కొట్టిపారేసిన కేంద్రం, వారందర్నీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్​కు వెళ్లాలని ఆదేశించింది. వీరందరినీ తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ డీవోపీటీ (Department of Personnel and Training) ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 16వ తేదీలోగా ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ అధికారులు: ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్‌లకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో కొనసాగించాలన్న ఐఏఎస్ అధికారులు వాణిప్రసాద్, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి, ప్రశాంతి ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి వినతిని తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో చేరాలని ఆదేశించింది.

ఏపీలో పని చేస్తున్న తెలంగాణ కేడర్ అధికారులు:అదే విధంగాఏపీలో పని చేస్తున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారులను సైతం కేంద్రం తిరస్కరించింది. ఈ మేరకు ముగ్గురు ఐఏఎస్‌లను ఏపీ నుంచి రిలీవ్ చేసింది. ఏపీలో పని చేస్తున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారులు ఎస్ ఎస్ రావత్, అనంత్ రాము, సృజన, శివశంకర్ లోతేటి, హరికిరణ్​లకు రిలీవ్ ఆర్థర్ జారీ అయ్యింది.

ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్‌ పెంపు - కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ - IPS Cadre Strength in AP

ఉమ్మడి రాష్ట్రంలోని ఐఏఎస్​, ఐపీఎస్​లను 2014లో తెలంగాణ, ఏపీ మధ్య విభజిస్తూ కేంద్ర వ్యక్తిగత, శిక్షణ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ఐఏఎస్ అధికారులు సోమేశ్‌కుమార్, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి, ప్రశాంతి, ఐపీఎస్​లు అంజనీకుమార్, సంతోష్‌మెహ్రా, అభిలాషబిస్త్, అభిషేక్ మహంతిని ఏపీకి కేటాయించారు. ఐఏఎస్​ అధికారులు అనంతరాము, సృజన గుమ్మల్ల, ఎస్ఎస్ రావత్, ఎల్.శివశంకర్, హరికిరణ్, ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను తెలంగాణను కేటాయించారు. విభజన తీరుపై అభ్యంతరం వ్యక్తం వారంతా 2014లో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఆ తర్వాత రంగనాథ్, సంతోష్ మెహ్రా తమ పిటిషన్లు వెనక్కి తీసుకున్నారు. మిగతా పిటిషన్లపై విచారణ జరిపిన క్యాట్ (Central Administrative Tribunal), 2016లో అధికారులకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది.

అయితే క్యాట్ తీర్పులను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని డీవోపీటీ 2017లో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. మొదట పిటిషన్లపై వేర్వేరుగా విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు, తెలంగాణ కేడర్​ను రద్దు చేసి ఏపీకి వెళ్లాలని గతేడాది జనవరిలో ఆదేశించింది. తరువాత మిగతా పిటిషన్లన్నీ కలిపి విచారణ జరిపిన హైకోర్టు, అధికారుల అభ్యర్థనలు, అభ్యంతరాలను మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది మార్చిలో తీర్పు వెల్లడించింది.

హైకోర్టు ఆదేశాల మేరకు కేడర్ కేటాయింపుల పునఃపరిశీలన కోసం డీవోపీటీ మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి దీపక్ ఖండేకర్​ను కేంద్రం నియమించింది. దీపక్ ఖండేకర్ ఏకసభ్య కమిటీ ఐఏఎస్, ఐపీఎస్​ల అభ్యంతరాలు, అభ్యర్థనలు, వాదనలు పరిశీలించింది. అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చి, గతంలో డీవోపీటీ నిర్ణయమే సరైనదని దీపక్ ఖండేకర్ కమిటీ సిఫార్సు చేసింది. కమిటీ సిఫార్సుల మేరకు తాజాగా డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారులు వాణిప్రసాద్, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, ఆమ్రపాలి, ఎం.ప్రశాంతి, ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మొహంతి ఏపీలో చేరాలని ఆదేశించింది. అదే విధంగా ఐఏఎస్ అధికారులు అనంతరాము, ఎస్ఎస్ రావత్, ఎల్.శివశంకర్, సృజన, హరికిరణ్ తెలంగాణలో ఈనెల 16లోగా చేరాలని ఆదేశించింది.

తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం - Telangana cadre employees relieved

Last Updated : Oct 10, 2024, 6:08 PM IST

ABOUT THE AUTHOR

...view details