తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆన్​లైన్ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం - త్వరలో రంగంలోకి దిగనున్న సైబర్ కమాండోలు - Cyber Commandos Training - CYBER COMMANDOS TRAINING

Cyber Commandos Recruitment : దేశవ్యాప్తంగా నెలకొన్న ప్రధాన సమస్యల్లో సైబర్ నేరాలు ఒకటి. వీటిపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం అయిదు వేల సైబర్ కమాండోలను సిద్దం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పోలీసుల్ని సైబర్ కమాండోలుగా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే కమాండోల ఎంపిక కోసం శారీరక సామర్థ్య, రాతపరీక్షలు నిర్వహించారు. వీటిలో 747 మంది ఎంపిక కాగా, వారిలో 346 మందిని షార్ట్​లిస్ట్ చేశారు. తెలంగాణ నుంచి ఒకే ఒక్క పోలీసు అధికారి వరంగల్​ కమిషనరేట్​లో పనిచేసే ప్రశాంత్​కుమార్ ఎంపికయ్యారు.

Cyber Commandos Recruitment
Cyber Commandos Training (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 26, 2024, 3:57 PM IST

Cyber Commandos Training :తెలంగాణలో రూ.759 కోట్లు, మహారాష్ట్రలో రూ.990 కోట్లు, ఉత్తరప్రదేశ్​లో రూ.721 కోట్లు, తమిళనాడులో రూ.662 కోట్లు, గుజరాత్లో రూ.650 కోట్లు. ఇదీ రాష్ట్రాలవారీగా సైబర్ నేరగాళ్లు ఏడాది కాలంలో కొల్లగొట్టిన సొత్తు విలువ. సైబర్ నేరాలపై 2023లో 'సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్​కు దేశవ్యాప్తంగా 11,28,265 ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సైబర్ ముఠాల ఎత్తుల్ని చిత్తు చేసేందుకు కేంద్రహోంశాఖ సైబర్ కమాండోలను రంగంలోకి దించబోతోంది.

వివిధ బలగాల నుంచి ఆహ్వానం : దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పోలీసుల్ని సైబర్ కమాండోలుగా తీర్చదిద్దనున్నారు. వచ్చే ఐదేళ్లలో సుమారు 5,000 మందిని రంగంలోకి దించాలని కేంద్రహోంశాఖ లక్ష్యంగా పెట్టుకొంది. ఈ బాధ్యతను ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ)కి అప్పగించింది. ఈ క్రమంలోనే తొలి విడతగా 346 మందిని ఎంపిక చేసింది. ముందుగా రాష్ట్రాల పోలీసులతోపాటు కేంద్ర పోలీస్ సంస్థలు, కేంద్ర పారామిలిటరీ బలగాల నుంచి 2023 అక్టోబరు 5న నామినేషన్లను ఆహ్వానించారు.

దేశవ్యాప్తంగా 1,128 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 24న 32 కేంద్రాల్లో శారీరక సామర్థ్య, రాతపరీక్షలు నిర్వహించారు. వీటిలో 747 మంది ఎంపిక కాగా, వారిలో 346 మందిని షార్ట్​లిస్ట్ చేశారు. ఈ సైబర్ కమాండోలకు ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చి, సైబర్ నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, ఛేదన తదితర అంశాల్లో మెరికలుగా తీర్చిదిద్దనున్నారు. సైబర్ కమాండోలుగా ఎంపికైన వారికి ఐఐటీ నిపుణుల పర్యవేక్షణలో పాఠాలు బోధించబోతున్నారు. జాయింట్ మేనేజ్​మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సమన్వయ), సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్(సీఎఫ్ఎంసీ) తదితర కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తారు.

ఐఐటీల్లో శిక్షణ : హైదరాబాద్​లోని నేషనల్ పోలీస్ అకాడమీతో పాటు కాన్పూర్, కొట్టాయం, నయా రాయ్​పూర్​ ఐఐటీలు, గాంధీనగర్ రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ(ఆర్ఆర్‌యై). దిల్లీ, గోవా, గాంధీనగర్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలు, పుణె డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ(డీఐఏటీ) తదితర ప్రఖ్యాత సంస్థల్లో తర్ఫీదు ఇస్తారు. ఆరు నెలల అనంతరం కమాండోలు విధుల్లోకి చేరనున్నారు. వీరు సొంత రాష్ట్రాల్లో ఐదేళ్లపాటు పనిచేయాల్సి ఉంటుంది.

ఈ శిక్షణ కోసం తెలంగాణ నుంచి ఒకే ఒక్కరు ఎంపికయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్​లో డిప్యూటీ అనలిటికల్ ఆఫీసర్​గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ కుమార్. బీటెక్ సీఎస్ఈ చదివిన ప్రశాంత్ కుమార్​కు సాంకేతికతపై పట్టు ఉండటంతో, కానిస్టేబుల్​గా ముందు నుంచీ సైబర్ నేరాల విభాగంలోనే ఉన్నారు. సైబర్ కమాండో శిక్షణ కోసం ప్రశాంత్ ఇప్పటికే కేరళకు వెళ్లారు.

సైబర్​ నేరగాళ్ల దారిలోనే పోలీసులు - మళ్లీ నేరాలకు పాల్పడకుండా కేటుగాళ్లపై సాంకేతిక బ్రహ్మాస్త్రం - New Cyber Security Strategy

పిల్లల కోసం దాచిన సొమ్మంతా పోగొట్టావ్ - కాపురాల్లో 'సైబర్ క్రైమ్' చిచ్చు - Cyber Crime Impact on Families

ABOUT THE AUTHOR

...view details