Industrial Smart City in Zaheerabad : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో పారిశ్రామిక నగరం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా జహీరాబాద్‌కు 9 కిలోమీటర్ల దూరంలో 3 వేల 245 ఎకరాల్లో 2 వేల 361 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా లక్షా 74 వేల మందికి ఉపాధి లభించనుందని కేంద్రం ప్రకటించింది. ఆటోమొబైల్, రవాణా పరికరాలు, మెటాలిక్, నాన్-మెటాలిక్ మినరల్స్, ఆహారశుద్ధి విద్యుత్ పరికరాలు తయారుచేస్తారు. తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటయ్యే ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి లబ్ధి కలగనుంది.
సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్, ఝరాసంగం మండలాల్లోని 17 గ్రామాల్లో జహీరాబాద్ పారిశ్రామిక నగరం నిర్మాణం జరగనుంది. రెండు దశల్లో దాదాపు 12 వేల ఎకరాల్లో ప్రాజెక్టు విస్తరించనుంది. 3 వేల 245 ఎకరాల్లో మొదటి దశ పనులు ప్రారంభం కానున్నట్లు కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుకు 65 కిలోమీటర్లు, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. జహీరాబాద్‌కు మహర్దశ రానుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక నిరుద్యోగ యువతకు లబ్ధి :ప్రాజెక్టుకు అవసరమైన 3 వేల 245 ఎకరాల్లో దాదాపు 80 శాతం భూమి రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంది. దాదాపు 10వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తోంది. దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులన్నీ అటవీ పర్యావరణ శాఖ నుంచి అందినట్లు కేంద్రం పేర్కొంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మంచిరోజులు రానున్నాయని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. జహీరాబాద్‌కే కాకుండా రాష్ట్రానికి పారిశ్రామికంగా ఊతం ఇస్తుందని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే, ఆర్థిక వృద్ధి రేటు పెరగడమే కాక స్థానికులకు ఉదోగ్య, ఉపాధి అవకాశాలు అపారంగా లభిస్తాయి. స్థానిక నిరుద్యోగ యువతకు లబ్ధి జరగనుందని పారిశ్రామిక వర్గాలు అంచనావేస్తున్నాయి.
'ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో భాగంగా 12 ప్రాజెక్టులు ప్రకటించారు. అందులో జహీరాబాద్ ఉండడం ఎంతో సంతోషదాయకం. జహీరాబాద్ ప్రజల తరఫున కేంద్రప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. రూ. 2,361 కోట్లతో జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు అవుతుంది. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. ఆర్థికంగా బలపడటానికి ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఎంతో దోహదపడుతుంది' - స్థానికులు
'12 ఇండస్ట్రియల్ సిటీలు, 30 లక్షల ఉద్యోగాలు'- కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలివే! - Cabinet Decisions Today