JEE Advanced Exams For Three Times : ఐఐటీల్లో బీటెక్ సీట్ల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే విద్యార్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఇప్పటి వరకు వరుసగా రెండు సంవత్సరాలు మాత్రమే రాసే అవకాశం ఉండగా ఇప్పటి నుంచి మూడేళ్లు రాసుకోవచ్చని కేంద్రం తెలిపింది. దీంతో 2022-23 విద్యాసంవత్సరంలో ఇంటర్ పాసైన వారికి కూడా ఈసారి ఈ పరీక్ష రాసేందుకు వీలు ఉంటుంది. అడ్వాన్స్‌డ్- 2025 నిర్వహణ బాధ్యత తీసుకున్న ఐఐటీ కాన్పుర్ ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించింది.
2000 అక్టోబరు 1 లేదా ఆ తర్వాత జన్మించిన వారు మాత్రమే 2025 అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అర్హులని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల మినహాయింపు కూడా ఇచ్చినట్లు తెలిపింది. ఈ వర్గాల్లో 1995 అక్టోబరు 1వ తేదీ లేదా ఆ తర్వాత పుట్టిన వారు కూడా ఈ పరీక్ష రాసుకోవచ్చని వెల్లడించింది. సిలబస్‌లో ఎటువంటి మార్పు లేదని, జేఈఈ మెయిన్‌లో స్కోర్ సాధించిన 2.50 లక్షల మంది అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసుకోవచ్చని ఐఐటీ కాన్పుర్ వివరించింది. మే మూడు లేదా నాలుగో వారంలో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
జేఈఈ మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఆ విషయంలో మీకో గుడ్ న్యూస్!