Domestic Violence Awareness by CDEW Centres :గృహహింస బాధితులకు సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్(సీడీఈడబ్ల్యూ) కేంద్రాల ద్వారా విముక్తి చేకూరుతోంది. సీడీఈడబ్ల్యూ కేంద్రాల్లో నిపుణులు కౌన్సెలింగ్ ఇస్తూ ఉండటంతో బాధితురాళ్లకు ఊరట లభిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని 27 కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సుమారు 13 వేల కేసులకు సంబంధించి దాదాపు 40 వేల కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహించారు. ఈ సెషన్ల్లో కౌన్సెలింగ్ పొందిన పలు జంటలు తిరిగి కలిసిపోయి తమ కాపురాలను చక్కదిద్దుకుంటున్నారు.
అక్టోబరులో గృహహింస అవగాహన మాసాన్ని పురస్కరించుకుని మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ఎల్‌బీనగర్, శంషాబాద్, అంబర్‌పేటలలో ఇటీవలే సదస్సులు నిర్వహించినట్లు మహిళా భద్రత విభాగం డీజీపీ శిఖాగోయెల్ తెలిపారు. బాధితులకు ఎదురైన గృహహింస వేధింపులను ఎలా సమర్థంగా ఎదుర్కొన్నామనే విషయాన్ని ఆయా సదస్సులో మహిళలు వివరించినట్లు చెప్పారు. ఆయా అంశాలు మరికొందరికి స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. గృహహింస బాధితురాళ్లు సీడీఈడబ్ల్యూ కేంద్రాలకు వెళ్లి తమ సమస్యలను చెప్పుకోవచ్చని సూచించారు. ఆయా కేంద్రాల్లోని నిపుణులు బాధితులకు కౌన్సెలింగ్ ద్వారా పరిష్కారాలు సూచిస్తారని తెలిపారు. సీడీఈడబ్ల్యూ కేంద్రాల సమాచారం కోసం 040-496338510 / 7093275068 సంప్రదించాలని పేర్కొన్నారు.
బాధితులకు అండగా హిళా సహాయక కేంద్రాలు : రాష్ట్రవ్యాప్తంగా 751 పోలీస్‌స్టేషన్లలో ఏర్పాటు చేసిన మహిళా సహాయక కేంద్రాలూ బాధితురాళ్లకు చేయూతనిస్తున్నాయని తెలంగాణ మహిళా భద్రత విభాగం వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబరులోనే గృహహింసకు సంబంధించి 1,408 ఫిర్యాదులు రాగా అందులో 286 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిందని, కేసుల్లో సయోధ్య కుదర్చగలిగాయని పేర్కొంది.