Case Against ACP and Tahsildar : ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే అభియోగాలపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ ఏసీపీ చాంద్‌బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకటరంగారెడ్డిపై కేసు నమోదైంది. వ్యాపారి శ్రీనివాసరాజును కిడ్నాప్ చేసి, రూ.కోట్లు విలువ చేసే 30 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఇందులో ఏసీపీ, తహసీల్దార్ పాత్ర ఉన్నట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. వీరితో పాటు మరో 11 మందిపైనా కేసు నమోదైంది.
Mokila Kidnap Case Updates : దీనిపై గతేడాది నవంబర్ రెండో వారంలో సైబరాబాద్‌లోని మోకిల పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. తాజాగా ఇదే కేసులో తహసీల్దార్‌ను విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేయడంలో కిడ్నాప్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన ముగ్గురు పరారీలో ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి శ్రీనివాసరాజుకు, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో 50 ఎకరాల భూమి ఉంది. ఆయన కుటుంబంతో కలిసి మోకిల రాణా పరిధిలో నివాసం ఉంటున్నారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - ఐదుగురు నిందితుల అరెస్ట్
శ్రీనివాసరాజుకు తన సమీప బంధువు ఏపీలోని భీమవరం జిల్లాకు చెందిన వ్యాపారి పెరిచర్ల సూర్యనారాయణరాజుతో కొన్ని విభేదాలున్నాయి. 2023 నవంబర్ 15న శ్రీనివాసరాజు శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామంలోని పాఠశాలలో తన కుమారుడు రోహిత్‌ను దింపేందుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా నాగులపల్లి దగ్గర అప్పటికే మాటువేసిన కొందరు ఆయనను బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. దాడి చేస్తూ కారులో వేర్వేరు ప్రాంతాల్లో తిప్పుతూ అతణ్ని చిత్రహింసలు పెట్టారు. బాధితుడు ఈ విషయాన్ని భార్యకు కాల్‌ద్వారా చెప్పగా ఆమె తన బంధువులకు సమాచారం ఇచ్చింది. ఈ వ్యవహారంపై మోకిల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.