తెలంగాణ

telangana

గర్భాశయ క్యాన్సర్​ను​ జయించి - పండంటి శిశువుకు జన్మనిచ్చిన తల్లి - Cancer Patient Gave Birth To Child

By ETV Bharat Telangana Team

Published : Jul 28, 2024, 3:31 PM IST

Cancer Patient Gave Birth To Child : ఓ గర్భిణీ క్యాన్స్​ర్​ మహమ్మారితో పోరాడి ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చింది. గర్భాశయ క్యాన్సర్​తో బాధపడుతున్న ఓ మహిళకు ప్రత్యేక శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా ప్రసవం చేశారు వైద్య నిపుణులు. ప్రస్తుతం తల్లీపిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వివరించారు.

Cancer Patient Gave Birth To Child
Cancer Patient Gave Birth To Child (ETV Bharat)

A woman who conquered cancer :సాధారణంగా క్యాన్సర్​ అనగానే ఒకింత ఆందోళనకు గురవుతాం. ఎందుకంటే జీవితంతో పోరాడాల్సి ఉంటుంది. చికిత్స చేసిన తర్వాత కూడా కొన్నాళ్లకు మళ్లీ తన స్వరూపాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా గర్భాశయం ముఖద్వార క్యాన్సర్​ వచ్చిందంటే గర్భం దాల్చడం, పిల్లలు పుట్టడం అనే ఆశలు వదిలేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గర్భాశయాన్ని తీసేయాల్సి వస్తుంది. కానీ ఓ యువతికి మాత్రం గర్భాశయం ముఖద్వార క్యాన్సర్​కు చికిత్స తర్వాత పండింటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు తల్లీకూతురు ఆరోగ్యవంతంగా ఉన్నారు. ఈ సంఘటన హైదరాబాద్​లోని కిమ్స్​ కడల్​ ఆసుపత్రిలో జరిగింది.

Cervical Cancer With Pregnancy : కిమ్స్​ కడల్స్​ ఆసుపత్రి సీనియర్​ కన్సల్టెంట్​ గైనకాలజిస్ట్​, రోబోటిక్​ అండ్​ లాప్రోస్కోపిక్​ సర్జన్​ డాక్టర్​ వసుంధర చీపురుపల్లి తెలిపిన వివరాల ప్రకారం, ఏపీలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చెందిన మౌనిక అనే యువతి మొదట ఒకసారి గర్భం దాల్చింది. కానీ కొన్నాళ్లకు లోపలున్న శిశువుకు ఆరోగ్యపరమైన సమస్యలు రావడంతో స్థానికంగా తప్పనిసరై గర్భస్రావం చేయించాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత ఆమెకు ఆరోగ్యం బాగోలేదని పరీక్ష చేయించుకోగా, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్​ వచ్చినట్లు గుర్తించారు. దీంతో తప్పనిసరిగా ఆ యువతికి గర్భ సంచి తొలగించాలని అక్కడి వైద్యులు చెప్పారు.

గర్భాశయ క్యాన్సర్​తో : గర్భ సంచి తొలగించుకోవడానికి అవసరమైన శస్త్ర చికిత్స చేయించుకోవడానికి కిమ్స్​ కడల్స్​ సికింద్రాబాద్​ ఆసుపత్రికి వచ్చారు. ఆమెకు ముందుగా క్యాన్సర్​ ఉన్నంత మాత్రాన గర్భ సంచి తొలిగిస్తే జీవితాంతం పిల్లలు పుట్టే అవకాశం ఉండదని చెప్పారు. కానీ గర్భ సంచి తీయకుండా క్యాన్సర్​కు చికిత్స చేయవచ్చని, ఆ తర్వాత పిల్లలు కూడా పొందవచ్చని వివరించారు. అయితే ఈ క్యాన్సర్​ గర్భాశయంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించకపోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం నూరు శాతం ఉంటుందని, నిరాశ పడాల్సిన అవసరం లేదని కౌన్సెలింగ్​ ఇచ్చారు. ఇలా రెండు, మూడుసార్లు కౌన్సెలింగ్​ చేసిన తర్వాత ఆ యువతి కుటుంబ సభ్యులు చికిత్సకు సిద్ధమయ్యారు.

శస్త్రచికిత్స చేసిన వైద్యులు :ఈ చికిత్సకు ముందు ముందుగానే పిండాలను (ఎంబ్రియో) సేకరించి, వాటిని ఫ్రీజ్​ చేసిన తర్వాత అప్పుడు క్యాన్సర్​ శస్త్రచికిత్సను ప్రారంభించామని డాక్టర్​ చెప్పారు. క్యాన్సర్​ ఉన్న ప్రాంతాన్ని జాగ్రత్తగా గుర్తించి, దాన్ని మాత్రమే తొలగించామన్నారు. అనంతరం గర్భ సంచికి కూడా కుట్లు వేశామని తెలిపారు. తొలగించిన ప్రాంతానికి బయాప్సీ చేయించగా క్యాన్సర్​ అక్కడ మాత్రమే ఉందని, ఇతర ప్రాంతాలకు వ్యాపించలేదని నిర్ధారించుకున్నామని డాక్టర్​ వసుంధర పేర్కొన్నారు.

'శస్త్రచికిత్స పూర్తయిన అనంతరం ఫ్రీజ్​ చేసిన రెండు పిండాలను గర్భసంచిలో ప్రవేశపెట్టాం. రెండూ ఫలదీకరణం చెందాయి. అయితే కుట్లు వేయడం వల్ల గర్భసంచి రెండు పిండాలను మోసే పరిస్థితి ఉండకపోవచ్చని ముందు జాగ్రత్తగా ఒక పిండాన్ని తీసేశాము. మిగిలిన ఒక పిండాన్నే అందులో ఉంచాము. పిండాలు ఫలదీకరణం చెందినప్పుడే మధ్యలో కూడా ఎందుకైనా మంచిదని క్యాన్సర్​ పరీక్షలు, ఇతర పరీక్షలు చేయించాము. 32 వారాల తర్వాత ముందు జాగ్రత్తగా లోపల శిశువుకు ఊపిరితిత్తులు బలంగా ఉండేందుకు ఇంజెక్షన్లు చేశాము. 34, 35 వారాల్లో ప్రసవం కావొచ్చని భావించాము కానీ, గర్భ సంచి బాగానే ఉండటంతో వేచి ఉన్నాము. సరిగ్గా 37 వారాల తర్వాత అంతా బాగుండటంతో ఆమెకు సిజేరియన్​ శస్త్రచికిత్స చేయగా పండింటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.' అని డాక్టర్​ వసుంధర చీపురుపల్లి తెలిపారు.

పాప పూర్తి ఆరోగ్యంతో ఉంది :ఇప్పుడు పాప పూర్తి ఆరోగ్యంతో ఉందని డాక్టర్​ వసుంధర చీపురుపల్లి తెలిపారు. క్యాన్సర్​ వచ్చింది కదా తర్వాత ఇబ్బంది లేకుండా ఉండేందుకు గర్భసంచిని తొలగించమని ఆ దంపతులు కోరారన్నారు. సిజేరియన్​ చేసిన సమయంలోనే హిస్టరెక్టమీ కూడా చేస్తే ఇబ్బందులు ఉంటాయి. పైగా క్యాన్సర్​ సమస్య లేకపోవడం వల్ల అలాగే వదిలేస్తే మంచిదని వారికి చెప్పామని చెప్పారు. ఇప్పుడు తల్లీబిడ్డలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్​ చీపురుపల్లి వసుంధర ఆనందం వ్యక్తం చేశారు.

"ఒకానొక ద‌శ‌లో మేము అస‌లు పిల్ల‌లు పుట్టే అవ‌కాశం లేద‌నుకున్నాం. కానీ డాక్ట‌ర్ వ‌సుంధ‌ర‌ చీపురుప‌ల్లి, కిమ్స్ కడల్స్ ఆస్ప‌త్రి బృందం ఎంత‌గానో మాకు న‌చ్చజెప్పారు. ఇప్పుడు మాకు మంచి ఆరోగ్య‌క‌ర‌మైన పాప పుట్టింది. మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం. కిమ్స్ కడల్స్ ఆస్ప‌త్రికి, డాక్ట‌ర్ వ‌సుంధ‌ర‌, ఆమె బృందానికి మేమెంతో కృత‌జ్ఞులై ఉంటాము. - మహేశ్​, మౌనిక భర్త

ABOUT THE AUTHOR

...view details