CAG Report on Kaleshwaram Project : రాష్ట్ర ఆర్థిక రంగానికి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పెనుభారంగా మారనుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక స్పష్టం చేసింది. 2022 మార్చికి కాళేశ్వరం ప్రాజెక్టు సంస్థకు మొత్తం రూ.96,064 కోట్ల రుణం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందని తెలిపింది. ఇందులో 2022 మార్చి నాటికి రూ.87,449.15 కోట్లు తీసుకుందని పేర్కొంది. 2035-36 నాటికి వడ్డీ సహా అక్షరాలా రూ.1,41,544.59 కోట్లు తిరిగి చెల్లించాలని వివరించింది. రుణ ఒప్పందాల ప్రకారం తొలుత పేర్కొన్న వడ్డీ రేట్లను పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తేనే తిరిగి చెల్లించాల్సిన సొమ్ము ఇంత ఉంటుందని, వడ్డీ రేట్లు మారుతుంటాయని స్పష్టం చేసింది. ఇవి పెరిగితే చెల్లించాల్సిన నగదు కూడా పెరుగుతుందని వెల్లడించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో మూడో రోజు తనిఖీలు - మినీ ట్రక్ సరిపడా దస్త్రాలు స్వాధీనం
Kaleshwaram Project Debts According to CAG : 2024-25 నుంచి కాళేశ్వరం పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభమై అనుకున్న ప్రకారం నీటిని ఎత్తిపోస్తే కరెంటు ఛార్జీల కింద ప్రభుత్వం ఏటా రూ.10,374.56 కోట్ల చొప్పున రాబోయే 12 ఏళ్లలో సుమారు రూ.1,24,495 కోట్లు చెల్లించాల్సి ఉంటుందనికాగ్తెలిపింది. దీనికి అదనంగా ప్రాజెక్టు వార్షిక నిర్వహణ కోసం రూ.272.70 కోట్లు, తరుగుదల ఖర్చుల కింద రూ.2,761 కోట్లు అవసరమని తెలియజేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) నివేదిక ప్రకారం పథకం పూర్తయినా పెద్దగా ఆదాయమేమీ రాదని తేల్చి చెప్పింది.
రాష్ట్రంలో ప్రజలకు సాగు, తాగునీరు సరఫరా చేసినందుకు రాబడిని పొందే నిబంధనలేమీ ఇప్పటివరకు లేవని పేర్కొంది. అందువల్ల రుణాన్ని వడ్డీ సహా తిరిగి చెల్లించడానికి, నిర్వహణ వ్యయం కలిపి మొత్తం రూ.2.66 లక్షల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వమే రాబోయే 12 ఏళ్లలో భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.