Cabinet NOD For rs33000 Crore Amaravati Works :రాజధాని అమరావతిలో చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రూ.33,137.98 కోట్లతో 45 ఇంజినీరింగ్ పనుల్ని చేపట్టేందుకు సీఆర్‌డీఏకి అనుమతిచ్చింది. ఐఏఎస్, గెజిటెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగుల క్వార్టర్లు, వరద నివారణ కార్యక్రమాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకర్లకు వివరించారు. రాజధాని అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. ఇందుకోసం హడ్కో ద్వారా రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు రుణాలు తీసుకోవడానికి సీఆర్‌డీఏకి ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు.
44,195 జల్‌జీవన్ మిషన్ పనులకు మళ్లీ టెండర్లు :వైఎస్సార్సీపీ ప్రభుత్వ చేతగానితనంతో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో తెలిపేందుకు జల్‌జీవన్ మిషన్ (జేజేఎం) ఒక ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని లక్షల మంది ప్రజలకు సురక్షిత నీరు అందించేందుకు జల్‌జీవన్ మిషన్ కింద 77,917 పనుల్ని చేపట్టేందుకు రూ.26,824 కోట్లు మంజూరు చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం రూ.4 వేల కోట్లే ఖర్చు చేసింది.
ఈ పథకం కింద గతంలో రూ.11,400 కోట్లతో మంజూరై ఇప్పటికీ పనులు ప్రారంభించని, 25% కంటే తక్కువ జరిగిన 44,195 పనుల్ని రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వివిధ దశల్లో ఉన్న 33,717 ప్రాజెక్టుల్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పులివెందుల, డోన్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయనున్నారు. అస్తవ్యస్తంగా ఉన్న ఇతర పనులన్నింటినీ పునఃపరిశీలించి ఈ ప్రాజెక్టులను తిరిగి డిజైన్ చేయాలని
క్యాబినెట్ తీర్మానించింది. జేజేఎం పునరుద్ధరణలో భాగంగా రూ.7,910 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 5 ఎంవీఎస్ పనులను రద్దు చేసి, నూతన డిజైన్లతో టెండర్లు పిలిచేందుకు అనుమతించింది. ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా డీపీఆర్‌ల తయారీకి అనుమతులు ఇచ్చేందుకు, అన్ని జేజేఎం పనుల పూర్తికి 6 నెలలపాటు గడువు పొడిగించే ప్రతిపాదనలకూ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. క్యాబినెట్ తీసుకున్న ఇతర నిర్ణయాలు ఇవీ.
విద్యార్థులకు పోటీపరీక్షల మెటీరియల్ :వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ కళాశాలల విద్యార్థులకు జేఈఈ, నీట్, ఈఏపీసెట్‌లపై శిక్షణ. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు పోటీ పరీక్షల మెటీరియల్. వీటిని బోధించేందుకు ప్రత్యేక సమయం కేటాయింపు.
- పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించి పంపిణీ.
- ప్రభుత్వ యాజమాన్యాల్లో చదువుతున్న విద్యార్థులకు రూ.32.45 కోట్ల వ్యయంతో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద కిట్లు. పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్, రికార్డ్ బుక్స్, రాతపుస్తకాలతో కిట్.
- ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం పునరుద్ధరణ. జనవరి నుంచి 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అమలు. అదే ప్రాంగణంలో కలిసి ఉన్న లేదా సమీపంలోని ఉన్నత పాఠశాలల నుంచే కళాశాల విద్యార్థులకూమధ్యాహ్న భోజనం.
- కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేట్ చేస్తూ విలువలతో కూడిన పాఠ్యప్రణాళిక రూపకల్పన.