Cabinet meeting in Telangana 2024: ఈనెల 18న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఏపీ, తెలంగాణ మధ్య పెండింగులో ఉన్న పునర్విభజన అంశాలపై కేబినెట్లో చర్చించనున్నారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, రానున్న ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా చర్చించాలని సీఎం నిర్ణయించారు. జూన్ 2తో రాష్ట్రం ఏర్పడిన పదేళ్లు పూర్తి కానున్నందన పునర్విభజన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల విభజన, ఇప్పటి వరకు పరిష్కరించినవి, పెండింగులో ఉన్న అంశాలు, తదితర వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Discussion in the Cabinet on partition Guarantees: రాష్ట్ర విభజన చట్టం ప్రకారం షెడ్యూలు 9, 10లో ఉన్న సంస్థల విభజన పూర్తి కాలేదని పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని అధికారులు సీఎంకు వివరించారు. విద్యుత్ సంస్థల బకాయిల వివాదం తేలలేదని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. తదుపరి కార్యచరణపై చర్చించారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్న ఉద్యోగుల బదిలీ వంటివి ముందుగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.