Father Dies After Baby Birth in Mahabubabad : కుమార్తె పుట్టిందని ఆ తండ్రి ఆనందానికి అంతే లేదు. మా ఇంట మహాలక్ష్మి అడుగు పెట్టిందని ఆనందంగా స్వీట్లు పంచుతూ అందరికీ చెప్పుకున్నాడు. ఆయన సంతోషాన్ని చూసి విధికి అసూయ పుట్టిందేమో తెలీదు కానీ మూర్చ రూపంలో ఆయనను బలితీసుకుంది. ఈ విషాద ఘటనతో ఆ కుటుంబమే కాదు, ఆ పల్లె కూడా కన్నీటి పర్యంతమైంది.
వివరాల్లోకి వెళ్తే : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లికి చెందిన కన్నెగంటి రమేశ్ (31) కూలీ పని చేస్తూ భార్య మౌనిక, మూడేళ్ల కుమార్తె సాహితితో కలిసి ఆనందంగా జీవిస్తున్నాడు. గత నెల 29న రమేశ్ భార్య ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రెండో కాన్పులో పండంటి పాపకు జన్మనిచ్చింది.
పాపను లాలించి వచ్చి తనువు చాలించిన తండ్రి : దీంతో తన ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని మురిసిపోయాడు రమేశ్. భార్యను అపురూపంగా చూసుకునే రమేశ్ ఆమెకు ఇంటి నుంచే ఆహారం తీసుకెళ్తున్నాడు. మంగళవారం కూడా ఆసుపత్రికి ఆహారం తీసుకెళ్లి భార్యకు సకల జాగ్రత్తలు చెప్పి పాపను అపురూపంగా ముద్దాడి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం అరికోడులో ఉండే బంధువుల ఇంటికి వెళ్లారు. బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మూర్చ రావడం, ఆ క్షణంలో ఎవరూ గుర్తించకపోవడంతో పరిస్థితి విషమించి అక్కడికక్కడే మృతి చెందారు.
తల్లడిల్లిన భార్య మౌనిక : మంగళవారం సంతోషంగా వెళ్లిన భర్త రమేశ్, బుధవారం మరణించడం చూసి భార్య మౌనిక తల్లడిల్లింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. మూడేళ్ల కుమార్తె సాహితికి అక్కడేం జరిగిందనేది తెలియక దిక్కులు చూస్తూ ఉండిపోయింది. 4 రోజుల పసికందుని బంధువులు లాలించాల్సిన దయనీయ స్థితి చూసి ఆ ఊరంతా కన్నీరు మున్నీరయ్యారు.
కుమార్తెకు జన్మనిచ్చిన భార్య - యాక్సిడెంట్లో చనిపోయి అదే ఆసుపత్రి మార్చురీలో భర్త
తండ్రి మరణం, కుమారుడి జననం - గద్వాల జిల్లాలో హృదయాన్ని మెలిపెట్టే విషాదం