Kolleru Lanka Villages Stuck in Flood Effect In AP :ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు లంక గ్రామాలు ముంపు గుప్పెట్లో చిక్కుకుంటున్నాయి. బుడమేరు ఉగ్రరూపం దాల్చడం వల్ల విజయవాడ అతలాకుతలం కాగా ఆ వరద నీరంతా కొల్లేరులో కలవడంతో లంక గ్రామాలకు వరద పోటు తాకింది. కొల్లేరు నీటిని సముద్రానికి తీసుకువెళ్లే ఉప్పుటేరు ఓ వైపు ఆక్రమణలు, నిర్వహణ లోపాలతో వరదనీటి ప్రవాహానికి అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
ఆ వరద ప్రభావం ఏలూరు జిల్లాలోని ఏలూరు, మండవల్లి, కైకలూరు మండల్లాలోని పలు గ్రామాలపై పడనుంది. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, మున్నేరుల నుంచి పెద్ద ఎత్తున వరదనీరు రావడంతో కొల్లేరు నిండుకుండను తలపిస్తోంది. ఎగువన కురిసిన వర్షాలకు కొల్లేరులో కలిసే 68 మేజర్, మైనర్ కాలువలు సైతం భారీగా వరద నీటిని తీసుకొస్తున్నాయి. దీంతో కొల్లేరు మరింత ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తోంది. కొల్లేరులో సాధారణ రోజుల్లో 10వేల క్యూసెక్కులు మాత్రమే ఉండే నీరు ప్రస్తుతం 25 వేల క్యూసెక్కులకు చేరింది.
రవాణాకు తీవ్ర అంతరాయం : కొల్లేరు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండటంతో బుధవారం ఉదయం నుంచే మండవల్లి మండలం పెనుమాకలంక, ఇంగిలిపాకలంక, నందిగామలంక గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మణుగులూరు, కొవ్వాడలంక గ్రామాల్లోకి నీరు చేరింది. చినఎడ్లగాడి దగ్గర ఏలూరు-కైకలూరు ప్రధాన రహదారిపై రెండు చోట్ల రెండడుగుల ఎత్తులో ప్రమాదకర స్థితిలో నీరు ప్రవహిస్తోంది.
ఆక్రమణలో చెరలో ఉప్పుటేరు :కొల్లేరు నీరు ఉప్పుటేరు ద్వారా మొగల్తూరు మండలం ములపర్రు వద్ద సముద్రంలో కలుస్తుంది. కానీ ఉప్పుటేరు అక్రమార్కుల చెరలో ఉంది. దాదాపు 5 వేల ఎకరాల వరకు ఆక్రమించుకుని రొయ్యల సాగు చేస్తున్నారు. మరికొందరు ఇళ్లు కట్టేశారు. ఉప్పుటేరు ఒక్కరోజులో 15 వేల క్యూసెక్కులు సముద్రంలోకి తీసుకువెళుతుంది. ఆక్రమణలతో అది 10 వేల క్యూసెక్కులకు పడిపోయింది. సామర్థ్యానికి మించి నీరు చేరితే కొల్లేరు లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రజలతో పాటు వేలాది మంది రైతన్నలు తీవ్రంగా నష్టాల పాలవుతున్నారు.
గాలికొదిలేసిన గత ప్రభుత్వాలు :ఉప్పుటేరు నిర్వహణను గత ప్రభుత్వాలు పూర్తిగా గాలికొదిలేశాయి. చివరిగా 12 ఏళ్ల క్రితం ఒక్కసారి మాత్రమే తవ్వారు. అప్పటి నుంచి ప్రక్షాళన చేయలేదు. గత 5 ఏళ్లలో తూడు, గుర్రపుడెక్క కూడా తొలగించలేదు. ఎక్కడ చూసినా కిక్కిసగడ్డి, తూడు, గుర్రపుడెక్కతో ఉప్పుటేరు నిండిపోయింది. దీంతో ప్రవాహ వేగానికి అడ్డంకులు ఏర్పడి చుట్టుపక్కల గ్రామాలు నీట మునిగిపోతున్నాయి. అధికారులు, పాలకులు ఇప్పటికైనా ఉప్పుటేరులో ఆక్రమణలు తొలగించి సక్రమంగా నిర్వహించకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాన మిగిల్చిన విషాదం - 117 గ్రామాల్లో 67 వేల మందికి నష్టం - 26 మంది మృతి - telangana floods heavy damage
కకావికలమైన మున్నేరు ప్రభావిత ప్రాంతాలు - ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు - Rescue Operation in Khammam