BRTS Roads In Vijayawada:ప్రభుత్వాలు మారుతున్నా బెజవాడవాసులకు బీఆర్టీఎస్ రహదారి నిర్మాణం చిరకాల స్వప్నంగానే మిగిలిపోతోంది. నగరం నలుదిక్కులా ఉన్న రోడ్లను అనుసంధానించి ఎక్కడి నుంచి ఎక్కడికైనా వేగంగా చేరుకునేలా రహదారిని నిర్మిస్తామన్న నాయకుల వాగ్దానాలు నీటిరాతలుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఆరు లైన్ల రహదారి మాత్రం పూర్తి కాలేదు.
ప్రజలకు చిరకాల స్వప్నంగా రోడ్లు: రోడ్ల వ్యవస్థలో బీఆర్టీఎస్ (బస్ ట్రాన్సిట్ రోడ్ సిస్టమ్) ఎంతో ప్రతిష్టాత్మకమైంది. అతికొద్ది నగరాల్లోనే ఉన్న బీఆర్టీఎస్ను విజయవాడకు తెచ్చేందుకు 2007లో అప్పటి ప్రభుత్వం చాలా కష్టపడింది. కేంద్రాన్ని ఒప్పించి మరీ మచిలీపట్నం రైల్వే లైనును తొలగించి 150 కోట్ల రూపాయలతో బీఆర్టీఎస్ పేరిట ఆరు లైన్ల రహదారి పనులకు శ్రీకారం చుట్టారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డులను కలుపుతూ ప్రత్యేక బస్సులు నడపాలని ప్రతిపాదించారు.
సీతన్నపేట గేటు నుంచి సత్యనారాయణపురం మీదుగా పడవలరేవు కూడలి వద్ద ఏలూరు రోడ్డు కలిసే ప్రాంతం వరకు పనులు చేపట్టారు. పనులు జోరుగా సాగడంతో ప్రజలు తెగ సంబరపడిపోయారు. రోడ్లపై బస్సులు విరివిగా తిరుగుతూ ఎక్కడికైనా క్షణాల్లో వెళ్లొచ్చని ఆశపడిన ప్రజలకు ప్రభుత్వ నిర్లక్ష్యం శాపంగా మారింది. సీతన్నపేట గేటు నుంచి రైల్వే స్టేషన్‌కు అక్కడి నుంచి బస్టాండ్‌కు కలపాల్సిన రహదారుల నిర్మాణాన్ని అప్పటి పాలకులు అసంపూర్తిగా వదిలేశారు. ఫలితంగా నేటికీ రహదారి పనులు పూర్తవలేదు. ఫలితంగా బస్సులు తిరగడం లేదు.