Harish Rao Slams Govt Over Crop Purchase : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. పెసర పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారిందని విమర్శించారు. పెసరకు మద్దతు ధర ప్రకటించినా ఎవరూ కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందన్నారు.
ఆహార పంటల బదులు పప్పుధాన్యాల సాగుతో మెరుగైన లాభాలు సాధించవచ్చన్న రైతుల ఆశలు అడియాశలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటా పెసరకు మద్దతు ధర రూ. 8,682 ప్రకటించినప్పటికీ ఆ ధరకు ఎవరూ కొనుగోలు చేయని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో వ్యవసాయ మార్కెట్లు, గ్రామీణ ప్రాంతాల వ్యాపారులకు పంటను క్వింటా రూ.6,000 నుంచి రూ.6,500 మధ్యనే రైతులు విక్రయిన్నారని వివరించారు.
రుణమాఫీ, రైతుబంధును ప్రభుత్వం అటకెక్కించింది : ప్రైవేటు వ్యాపారులు ఆడిందే ఆటగా మారడంతో అన్నదాతలకు నష్టం జరిగిందని హరీశ్ రావు పేర్కొన్నారు. పంట అమ్మిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే దళారులకే లబ్ధి జరుగుతుందని, దాని వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం ఉండని తెలిపారు. రుణమాఫీ, రైతుబంధును ప్రభుత్వం అటకెక్కించిన సర్కార్, మద్దతు ధరకు పంటల కొనుగోలును సైతం విస్మరిస్తోందని విమర్శించారు. పంటలు పండించడం, విక్రయం కత్తిమీద సాముగా మారిందని, తక్షణమే జిల్లాల్లో పెసర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని హరీశ్‌రావు లేఖలో సీఎంను డిమాండ్ చేశారు.