BRS Protest Against LRS in Telangana 2024 : రాష్ట్ర సర్కార్ ఎల్‌ఆర్‌ఎస్‌పై చేసిన ప్రకటనతో బీఆర్‌ఎస్ భగ్గుమంది. గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ దళం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. లే అవుట్ల క్రమబద్ధీకరణ కార్యక్రమాన్ని పేదలకు ఉచితంగా చేసిపెట్టాలని ఆందోళనలు నిర్వహించింది. హైదరాబాద్ అమీర్ పేటలోని హెచ్‌ఎండీఏ (HMDA) కార్యాలయం వద్ద మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఖరిపై ధర్నా నిర్వహించారు. వినతి పత్రంతో పాటు వెయ్యి మంచి నీళ్ల బాటిళ్లను తలసాని సాయి కిరణ్ అధికారులను ఇచ్చి వినూత్నంగా నిరసన తెలిపారు.
Congress Free LRS : ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు అలవి కాని హామీలు ఇచ్చి ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేస్తామని చెప్పారని ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠాగోపాల్‌లు ఆరోపించారు. ప్రజలపై భారం మోపితే ఊరుకోబోమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ మాజీ, ప్రస్తుత ప్రతినిధులు సహా కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ప్లకార్డులతో నిరసన తెలిపారు.
ఎల్‌ఆర్‌ఎస్‌పై బీఆర్ఎస్ పోరు - నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
"కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎల్‌ఆర్ఎస్‌ను ఉచితంగా చేస్తామని ప్రకటించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంకు డబ్బులు వసులు చేసే ఉద్ధేశ్యం లేదు. ఉంటే అధికారంలో ఉన్నప్పుడే వసూలు చేసే వాళ్లం. మార్చి 31 వరకు విధించిన గడువు వల్ల 25 లక్షల కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. వెంటనే తిరిగి రోల్‌బ్యాక్ చేయాలని కోరుతున్నాం."-తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి