BRS Got Zero Seats in Lok Sabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ విజయం సాధించని భారత్ రాష్ట్ర సమితి దారుణ ఓటమిని చవిచూసింది. పార్టీ చరిత్రలోనే ఘోర పరాజయంతో పార్లమెంట్‌లో ప్రాతినిధ్యాన్నే కోల్పోయింది. 2004 ఎన్నికలు మొదలుకొంటే లోక్‌సభలో గులాబీ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారి. 2004లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ ఐదు స్థానాలను గెలుచుకుంది. 2009లో మహాకూటమిలో భాగస్వామిగా పోటీ చేసి కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
Lok Sabha Election Results 2024 in Telangana :రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 2014లో ఒంటరిగా పోటీ చేసి అత్యధికంగా 11 సీట్లలో విజయం సాధించింది. రాష్ట్రంలో రెండో మారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు తొమ్మిది స్థానాల్లో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక పోయింది.
ఒక్కటంటే ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలవని బీఆర్ఎస్ : అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు మాత్రమే గెలుచుకుని అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్, ఈ ఎన్నికల్లో అంత కంటే ఘోర పరాజయాన్ని చవిచూసి ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు. మొత్తం 17 సీట్లకుగాను ఏకంగా ఎనిమిది స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ధరావత్తు కూడా కోల్పోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్, జహీరాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కూడా దక్కించుకోలేదు.
BRS Got Zero Seats in Telangana 2024 : ఇందులో మూడు స్థానాలు చేవెళ్ల, మహబూబ్‌నగర్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలు బీఆర్ఎస్‌కు సిట్టింగ్ ఎంపీ సీట్లు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు. అయినప్పటికీ అక్కడ ఆ పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది. లాస్య నందిత మరణంతో వచ్చిన కంటోన్మెంట్ ఉపఎన్నికలోనూ భారత్ రాష్ట్ర సమితి పరాజయం పాలైంది.