BRS MLAS SLAMS CM REVANTH :సీతారామ ప్రాజెక్టు ఎనిమిది నెలల్లో పూర్తి చేసే సత్తా ఉంటే, పాలమూరు- రంగారెడ్డి పనులు ఎందుకు చేయలేదని ప్రభుత్వాన్ని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 47 లక్షల మందికి కావాల్సిన రుణమాఫీని కేవలం 22 లక్షల మందికి చేశారని, మిగతా రైతులకు చేయనందుకు అమరవీరుల స్థూపం వద్ద ఎవరు ముక్కు నేలకు రాయాలో ఆలోచించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. తమను ఎంత అవమానించినా తాము ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటామని పేర్కొన్నారు.
అన్ని అవాస్తావాలే : ముఖ్యమంత్రి మాటల్లో అబద్ధాలు, అవాస్తవాలు, బూతులు తప్ప ఇంకోటి లేవని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆక్షేపించారు. 29 రాష్ట్రాల్లోని ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించడం లేదని ఆయన దుయ్యబట్టారు. 30 వేలు కాదు, మూడు ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని, ఎనిమిది నెలల్లో ప్రాజెక్టు సాధ్యం అయితే కొడంగల్-నారాయణపేటలో తట్టెడుమట్టి కూడా ఎందుకు తీయలేదని ఆయన ప్రశ్నించారు.
రుణమాఫీ మొత్తం చేశామని సీఎం పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారని, దేశంలోనే అతి పెద్ద మోసమని పల్లా ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టు వేసి దేవుళ్లను కూడా మోసం చేస్తున్నారని, హరీశ్‌రావు నిఖార్సయిన నాయకుడు, ఉద్యమకారుడని పల్లా తెలిపారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు సంపూర్ణంగా పూర్తి చేస్తే రాజీనామా చేస్తా అని హరీశ్‌రావు సవాల్ చేశారని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి భాషను పశువులు కూడా సహించవని, ఆయనలో మృగం ఆవహించిందని అందరూ అనుకుంటున్నారని పేర్కొన్నారు.