Jagadish Reddy Comments On Congress Govt :నీళ్లను ఎలా ఎత్తి పోయాలనే సోయి ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులకు వ్యవసాయంపై అవగాహన లేదని అన్నారు. తెలంగాణ ఎప్పటికైనా లిఫ్ట్‌ల మీద ఆధారపడాల్సిందేనని తెలిపారు. కృష్ణా, గోదావరి నదులు ఆంధ్రా కోసమే పుట్టినట్లు గతంలో పాలకులు వ్యవహరించారని మండిపడ్డారు. నీళ్లు ఎలా లిఫ్ట్ చేయాలో తెలిసి కేసీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్‌ను నిర్మించారని చెప్పారు.
రైతులకు నీరు ఇవ్వాలి: విహార యాత్రలు చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటైందని విమర్శించారు. గోదావరి రామగుండంలో, ప్రాణహిత వద్ద ఎలా ఉందో వెళ్లి చూడాలని సూచించారు. మేడిగడ్డకు ఏదో జరిగిందని ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోందని ఆక్షేపించారు. ఎల్లంపల్లి నుంచి నీరు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, సింగూరు ప్రాజెక్టులు నీళ్లు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో రైతులు నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.
భద్రాచలానికి ప్రమాదం: మేడిగడ్డ దగ్గర 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరంపై నాటకాలు ఆడాయని ఆరోపించారు. ఎన్‌డీఎస్‌ఏ హైదరాబాద్ రాకుండా దిల్లీ నుంచే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్లు రిపోర్ట్ ఇచ్చిందని విమర్శించారు. భద్రాచలానికి ప్రమాదం జరిగితే అది పోలవరం వల్లే జరుగుతుందని పేర్కొన్నారు. ఇరిగేషన్ మంత్రి అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, నాడు బీఆర్ఎస్ పాలనలో మండు వేసవిలోనూ అలుగుపారిన చెరువులు ప్రస్తుత సర్కార్ హయాంలో ఎండిపోయి దర్శనమిచ్చాయంటూ వ్యాఖ్యానించారు.