BRS MLA Harish Rao Comments On CM Revanth : కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయారని, నిరంతరం పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిదని అన్నారు. పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర తనదని చెప్పుకొచ్చారు.
తనకు పదవులు కొత్త కాదని, రాజీనామాలు కొత్త కాదని ప్రజలకు తన వల్ల మంచి జరుగుతుందంటే తాను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడనని హరీశ్ తెలిపారు. ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రూ. 2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేసి చూపించమని సవాలు విసిరారు. రుణమాఫీ, హామీల అమలు చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని చేయని పక్షంలో నువ్వు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డిని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
రైతులకు గడువులోపు రుణమాఫీ :రుణమాఫీపై సవాల్ చేసిన నాయకున్ని తాము రాజీనామా చేయమనట్లేదని ఎందుకంటే వారు ఎలాగూ పారిపోతారని తమకు తెలుసని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును ఉద్దేశించి అన్నారు. మీలాంటి బూటకపు మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట మీద నిలబడుతుందన్న నిజాన్ని ఇప్పటికైనా తెలుసుకోవాలని అన్నారు.