BRS Leader KTR on Singareni Coal Mines Privatization : తెలంగాణ గొంతుకు పార్లమెంటులో లేదన్న భ్రమతోనే కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణి ప్రైవేటీకరణ కోసం కుటిల ప్రయత్నం చేస్తున్నాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణి ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని ఆరోపించారు. సింగరేణి ప్రాంత మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో ఆయన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు.
కేంద్రంతో ముఖ్యమంత్రి కుమ్మక్కై బీజేపీకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తర్వాత సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై, నవ్వుకుంటూ సింగరేణి గనులను అమ్మకానికి పెట్టినట్లు ప్రతి సింగరేణి కార్మికునికి అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.
"మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలతో ఉద్యమ కాలం నాటి నుంచే పని చేయించారు. సకల జనుల సమ్మె సమయంలో సింగరేణి ప్రాధాన్యతను దేశం గుర్తించింది. సమ్మె కాలంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తెలంగాణ ఉద్యమం కాలంలో అద్భుతంగా పని చేశాయి. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం బీఆర్ఎస్ విధానం. ఉద్యమకాలం నుంచి ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే తమ విధానం. ప్రైవేటు కంపెనీలు ఎంత ఒత్తిడి తెచ్చినా పక్కకు పెట్టి రైతుబీమాను, ఎల్ఐసీ ఇచ్చారు. విద్యుత్ ప్రాజెక్టులను కట్టే బాధ్యతలను బీహెచ్ఈఎల్కు అప్పిగించాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్ల పాటు సింగరేణి సంస్థ అభివృద్ధి, విస్తరణ కోసం పని చేశామో ప్రతి సింగరేణి కార్మికునికి అవగాహన ఉంది.- కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు