BRS Vinod Kumar On Bayyaram Steel Plant : భద్రాచలం - మల్కన్‌గిరి రైల్వే లైన్‌కు అనుమతుల దృష్ట్యా వెంటనే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. రైల్వే లైన్ లేకపోవడం వల్లనే బయ్యారానికి ఉక్కు కర్మాగారం రావడం లేదని, ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా విశాఖ కన్నా బయ్యారంకే దగ్గర అని పేర్కొన్నారు.
బయ్యారంలో ఉక్కు కర్మగారం ఏర్పాటు చేయాలి :బయ్యారంలో 300 మిలియన్ టన్నుల ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని గతంలోనే సెయిల్ ప్రాతిపాదించిందన్న ఆయన అక్కడ ఫ్యాక్టరీ వస్తే 4000 మందికి ప్రత్యక్షంగా, పదివేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని వివరించారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తేనే ఈ రైల్వే లైన్ తెలంగాణకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కొత్త రైల్వే లైన్ ఖనిజ సంపదను గుజరాత్ తరలించేందుకు ఉపయోగపడేలా మారకూడదని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.
విభజన హామీల సాధనకు కృషిచేయాలి :2030 నాటికి తలసరి ఉక్కు వినియోగాన్ని భారీగా పెంచాలని కేంద్రం 2017లో విధానం తీసుకొచ్చిందని, బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడితేనే ఈ తలసరి వినియోగం పెరుగుతుందని అన్నారు. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో భారీ పరిశ్రమలకు పది పైసలైనా ఇచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు విభజన హామీలు నెరవేర్చేందుకు కృషి చేయాలని వినోద్ కుమార్ కోరారు.