Boyfriend killed his Girlfriend With Knife in Eluru :సమాజంలో రోజురోజుకూ ఆడవారిపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. మహిళలు కనిపిస్తే చాలు క్రూరమృగాలుగా మారి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారు కొందరు. వావివరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్న వారు మరికొందరు. ప్రేమిస్తున్నామంటూ వెంటపడతారు. అమ్మాయి ఒప్పుకోకపోతే ఎంతకైనా తెగిస్తారు. తనకు అమ్మాయి దక్కలేదనే కక్షతో దాడులకు తెగబడుతున్నారు. అంతేకాదు ప్రాణాలు సైతం తీసేందుకు వెనకాడటం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు పట్టణంలో జరిగింది.
ప్రేమించాలంటూ వేధింపులు:ప్రేమిస్తున్నానంటూ వెంటపడటమే కాకుండా తన ప్రేమను నిరాకరించడంతో ఆ యువతిని కత్తితో దారుణంగా నరికి చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్లో ఏలూరులో చోటుచేసుకుంది. ఏలూరు నగరంలోని ఎమ్మార్సీ కాలనీకి చెందిన జక్కుల రత్న గ్రేస్ అనే యువతిని తొట్టిబోయిన ఏసురత్నం అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం యువతి తన ఇంటి సమీపంలో ఉండగా, ఆమె వద్దకు వచ్చిన ఏసురత్నం మరోసారి యువతిని ప్రేమించాలంటూ వేధించాడు.