Blind Young Man Inspirational Story in Khammam : పుట్టుకతోనే అంధత్వం బారిన పడ్డాడీ యువకుడు. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా, ప్రముఖ వైద్యులను కలిసినా ఈ యువకుడికి కంటిచూపు వచ్చే అవకాశం లేదని చెప్పారు. దీంతో అతని గుండె బరువెక్కింది. ఆ బాధను దిగమింగుతూ తన లోపాన్ని మరిచే పనిలో పడ్డాడు. అంధత్వం ఇచ్చిన దేవుడు, అద్భుతమైన జ్ఞాపకశక్తి ఇవ్వడంతో కంటిచూపు లేకున్నా మనోనేత్రంతో అబ్బురపరుస్తున్నాడు.
ఒకసారి విన్నదేదైనా ఇట్టే చెప్పేస్తూ, తనకు మాత్రమే సొంతమైన జ్ఞాపకశక్తితో అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. ఒక్కసారి విన్నాడంటే చాలు ఠక్కున చెప్పేయడంతోపాటు మళ్లీ జీవితంలో ఎన్నడూ మరిచిపోకుండా అద్భుతమైన ప్రతిభతో సత్తా చాటుతున్నాడు. అంతేకాదు స్వయం కృషి, పట్టుదలతో డిగ్రీ సైతం పూర్తి చేసి ప్రస్తుతం పోటీపరీక్షలకు సిద్ధమవుతూ అబ్బురపరుస్తున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు.
Nagaraju Blind Man Inspirational Story : ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రావికంపాడు గ్రామానికి చెందిన వల్లెబోయిన నాగరాజు పుట్టుకతోనే అంధుడు. నిరుపేద దంపతులు భాస్కర్ రావు, లక్ష్మీల కుమారుడు. నాగరుజుకు రెండుకళ్లు పూర్తిగా కనిపించవు. కొడుకు చూపు తెప్పించేందుకు తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. హైదరాబాద్, విజయవాడలోని ప్రముఖ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది. మెదడుకు వెళ్లే నరాలు మూసుకుపోయాయని, ఇక జీవితంలో చూపు వచ్చే అవకాశం లేదని వైద్యులుతేల్చి చెప్పారు.
దూరవిద్యలో డిగ్రీ - ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత : ప్రయత్నాలు చేయడం వృథా ప్రయాసేనని సలహా ఇచ్చారు. దీంతో, నిరాశగా వెనుదిరిగిన తల్లిదండ్రులు కుమిలిపోయారు. ఈ పరిస్థితుల్లో నాగరాజు స్థానిక ప్రాథమిక పాఠశాలలోనే 5వ తరగతి వరకు చదువుకున్నాడు. పై తరగతులకు వేరే ఊరు వెళ్లాల్సి రావడంతో, చదువు నిలిపివేశారు. పెరిగి పెద్దవాడైన తర్వాత నాగరాజు దూరవిద్యలో పదో తరగతి, డిగ్రీ పూర్తి చేశాడు. సహాయకుడిని పెట్టుకుని పరీక్షలు రాసి డిగ్రీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు.