RAGHUNANDAN RAO ON HYDRA OPERATION :హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూలగొట్టాలని 2014లోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన గుర్తుచేశారు. పురపాలక మంత్రిగా కేటీఆర్ చేసినన్నీ తప్పులు ఎవరూ చేయలేదని రఘునందన్‌రావు దుయ్యబట్టారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఎన్ కన్వెన్షన్‌ను కూలగొట్టలేదని, చెరువులు ఎక్కడ కబ్జా చేశారో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్‌కు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు.
డ్రామా నడిపిస్తున్నారు : కేటీఆర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు వారి బాధ్యతలు మర్చిపోయి మాట్లాడుతున్నారని రఘునందన్‌రావు పేర్కొన్నారు. పార్టీలనే తేడా లేకుండా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చాలనీ 2010 లోనే హై కోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చేసినట్టు ఒక డ్రామా నడిపిస్తున్నారని, రేవంత్ రెడ్డికి, హైడ్రాకు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు గుర్తించిన రెండు వేల ఐదు వందల చెరువులు కాపాడాలని పేర్కొన్నారు.
ముక్కు పిండి వసూలు చేయాలి : ఇవాళ మీరాళం ట్యాంక్ ఉందా? అని రఘునందన్‌రావు ప్రశ్నించారు. అక్కడి ఎంఐఎం వాళ్లకి, కార్పొరేటర్లకు భయపడి హైడ్రా వెనక్కి తగ్గిందన్నారు. ఆంధ్రోళ్లు అనేక కబ్జాలు చేశారని, వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. 2014 లోనే ఎన్ కన్వెన్షన్ కూలగొట్టలని హై కోర్టు తీర్పు ఇచ్చిందని, 2014 నుంచి ఈ కన్వెన్షన్ పై వచ్చిన ఆదాయాన్ని హీరో నుంచి ముక్కు పిండి వసూలు చేయాలని డిమాండ్ చేశారు.