BJP Leaders Protest Against Congress : నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం కాంగ్రెస్ కార్యకర్తల దాడి నేపథ్యంలో తాజాగా గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ యువమోర్చా బయలుదేరింది. ఈ ముట్టడిపై ముందుగానే సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. బీజేపీ కార్యకర్తలు బయటకు రాకుండా ఆ మార్గంలోని దారులను మూసివేశారు. వేరేమార్గాల నుంచి దాడికి వెళ్తారనే అనుమానంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. మరోవైపు కొందరు కార్యకర్తలు గాంధీభవన్ వద్దకు చేరుకొని కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలను చించేశారు.
ఎక్కడికక్కడే అరెస్టులు : రెండు బృందాలుగా గాంధీ భవన్‌ను ముట్టడించేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. పోలీసులు తమను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ యువమోర్చా కార్యకర్తలు ముందుకు కదిలారు. పోలీసులు వీరిని ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. ఈ ఘర్షణ నేపథ్యంలో నాంపల్లి మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ప్రియాంక గాంధీపై వివాదస్పద వ్యాఖ్యలు : కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీపై దిల్లీకి చెందిన భాజపా నేత రమేశ్ బిదూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి వచ్చారు. దీనికి నిరసనగా బీజేపీ యువమోర్చా గాంధీభవన్ ముట్టడి చేపట్టింది.