Bharat Ratna for Former PM PV Narasimha Rao : తత్వవేత్తలు దేశాన్ని పరిపాలిస్తే ప్రజలందరికీ సరైన న్యాయం జరుగుతుందని సమాజ స్థితిగతులు వారికే క్షుణ్ణంగా అర్థమవుతాయన్నది ప్లేటో మాట. మంచి చెడు విచక్షణ తెలుసుకుని తనంతట తానుగా ఆలోచించి తరతరాలకు ఆదర్శప్రాయంగా నిలిచే నిర్ణయం తీసుకునేవాళ్లే అసలైన పాలకులు అన్నాడు చాణక్యుడు. ఈ లక్షణాలు అన్నీ పీవీ నరసింహారావులో కనిపిస్తాయనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి.
అయితే ప్రధాని పదవి పీవీ(PV Narasimha Rao)ని అనుకోకుండా వరించిందనే చెప్పాలి. ఎందుకంటే 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు. కానీ ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఈ సమయంలో పీవీ నరసింహారావు వానప్రస్థం నుంచి తిరిగి వచ్చి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి గంగుల ప్రతాపరెడ్డితో రాజీనామా చేయించిన కాంగ్రెస్, అక్కడి ఉప ఎన్నికల్లో పీవీ గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు.
అయితే ఆ సమయం ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి చాలా క్లిష్టమనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి అది. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో పని చేసిన అపార అనుభవం పీవీకి ఈ కష్టకాలంలో తోడ్పడ్డాయి. ఈ క్రమంలో ఐదేళ్ల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబాల తర్వాత మొదటి వ్యక్తి తెలుగుతేజం పీపీ నరసింహారావునే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. అందుకే ఆయనను అపర చాణుక్యుడు అని అన్నారు. ప్రధానిగా ఉండగా మన్మోహన్ సింగ్(Manmohan Singh)ను ఆర్థిక మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పునకు నాంది పలికింది.
సాధారణ ఎన్నికల్లో ఓటమి నుంచి దేశ ప్రధానిగా - పీవీ ప్రస్థానం సాగిందిలా
Bharat Ratna PV Narasimha Rao :రాజకీయాల్లో ఉన్న వారు సాధారణంగా తన వారికి, బంధుమిత్రులకు ముఖ్యమైన పదవులు ఇవ్వాలని భావిస్తారు. అందుకు భిన్నమైన మనస్తత్వం పీవీది. జెనీవాలో ఐక్య రాజ్య సమితి సమావేశాల్లో భారత ప్రతినిధిగా ప్రతిపక్ష నాయకుడు వాజ్‌పేయీ(Vajpayee)ని పంపించటం అరుదైన విషయం. లాతూరు భూకంపం ఘటనలో ప్రధానిగా పీవీ స్వయంగా తీసుకున్న చొరవ వేలాది మంది ప్రాణాలు కాపాడింది.