Bharat Biotech Launched Hillchol Vaccine : ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికా సహా అనేక దేశాల్లో కలరా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. 2021 తర్వాత ఈ బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ తీవ్రత మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో కలరా నియంత్రణకు హైదరాబాద్ ఫార్మా దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ ఓరల్ వ్యాక్సిన్ని అందుబాటులోకి తెచ్చింది. వెల్కమ్ ట్రస్ట్, హిలమెన్ ల్యాబరేటరీస్తో కలిసి 'హిల్‌కాల్' పేరుతో వ్యాక్సిన్ను మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా, వెల్కమ్ ట్రస్ట్ నుంచి జులియా కెంప్, కలరా వ్యాక్సిన్ల పితామహుడిగా పేరొందిన డాక్టర్ జాన్ హోల్మెగ్రెన్, కేంద్ర ప్రభుత్వ మాజీ సలహాదారు ప్రొఫెసర్ విజయ్ రాఘవన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
నోటి ద్వారా ఇచ్చే హిల్‌కాల్ వ్యాక్సిన్ :ప్రపంచవ్యాప్తంగా 2023 నుంచి ఇప్పటి వరకు 8,24,479 మందికి కలరా సోకగా 5,900 మరణాలు సంభవించాయని గణాంకాలు చెబుతున్నాయని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. అయితే వ్యాధి అంతకంతకూ పెరుగుతున్నా వ్యాక్సిన్లు మాత్రం ఆ స్థాయిలో అందుబాటులో లేవని ఆవేదన చెందారు.
ఈ నేపథ్యంలో హిల్ కాల్ వ్యాక్సిన్ని అందుబాటులోకి తెచ్చినట్లు భారత్ బయోటెక్ ప్రకటించిందన్నారు. నోటి ద్వారా ఇచ్చే ఈ వ్యాక్సిన్ సింగిల్ స్ట్రెయిన్ వ్యాక్సిన్ కావటం విశేషం. ఇది మొత్తం రెండు డోసులలో వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. తొలిడోస్ ఇచ్చిన 14 రోజుల తర్వాత రెండో డోస్ ఇవ్వాల్సి ఉంటుందని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు.