Another Jungle Safari Started In Adilabad : జంగిల్ సఫారీ అంటే ఇష్టపడేవారి కోసం కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు మరో జంగిల్ సఫారీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని అటవీ ప్రాంతంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని దీన్ని ప్రారంభించారు. 5 నెలలు యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టి జంతువుల ఆవాసానికి అనుకూలంగా మార్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో అనేక రకాల జంతువులు సంచరిస్తూ వాటికి చిక్కాయి.
ప్రత్యేక వ్యూ పాయింట్లు, మంచెలు : ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో పలు రకాల జంతువులు అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉండేవి. సంబంధిత శాఖ వీటి కోసమే పలు రకాల సదుపాయాలు ఏర్పాటు చేసింది. గతంలో రెండు నీటి కుంటలను, ఇటీవల మరో రెండింటిని సిద్ధం చేసింది. కృత్రిమ గడ్డివనాలు పెంచడం ప్రారంభించింది. సందర్శకుల సౌకర్యార్థం ప్రత్యేక వ్యూ పాయింట్లు, మంచెలను సిద్ధంగా ఉంచింది. సుమారు 20 కిలోమీటర్ల మేర ఉన్న ఈ సఫారీలో ప్రస్తుతం అడవి కుక్కల మొదలు జింకలు, అడవిదున్నలు, చిరుతపులులు, ఇటీవల తరచూ పెద్దపులులు సంచరిస్తున్న చిత్రాలు ఇక్కడి కెమెరాలు బంధించాయి కూడా.
ప్రతిరోజు మూడు రైడ్లు : ఇటీవల ప్రారంభించిన ఈ సఫారీని ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది అటవీశాఖ. భవిష్యత్తులో ఆన్‌లైన్ సదుపాయం కల్పించేందుకు సన్నద్ధమవుతుంది. ప్రతిరోజు మూడు సఫారీ రైడ్లు నడుపుతుంది. ఉదయం 6.30, 9.30, మధ్యాహ్నం 3.30కు సఫారీ ఉంటుంది. ఒక్కో సఫారీ ధర రూ.2100గా నిర్ణయించారు. అందులో (వాహనంలో) ఆరుగురికి అవకాశముంటుంది. అదనంగా ప్రయాణించాలంచే ఒక్కో వ్యక్తికి రూ.350(ఇద్దరికి మాత్రమే) వసూలు చేస్తోంది.
20 కిలోమీటర్ల మేర సిద్ధం చేసిన సఫారీలో సుమారు 3 గంటలపాటు గడిపే అవకాశముంది. జంతువులతో పాటు క్వారీ, గాంధారిఖిల్లా అందాలు అదనంగా చూపిస్తారు. ఈ అటవీశాఖ సిబ్బందిని సంప్రదించి సఫారీని బుక్ చేసుకోవచ్చు. బస్సు, రైల్వే సౌకర్యాలు ఉండగా కూతవేటు దూరంలో సాధారణ, మూడుస్టార్ల హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్రం, జంగిల్ సఫారీ ప్రాంతానికి దూరం కూడా రెండున్నర కిలోమీటర్లే కావడం విశేషం.
తెలంగాణలో 'అరకు' అందాలు! : గఢ్‌పూర్ జంగిల్ సఫారీ - చూసేందుకు రారమ్మంటోంది
గాండ్రిస్తూ దూసుకొచ్చిన పెద్దపులి.. భయంతో వణికిపోయిన టూరిస్ట్‌లు.. చివరకు ఏమైంది?