Illegal PDS Rice Cases in Telangana : పీడీఎస్ బియ్యం కేసుల్లో పట్టుబడ్డ వారితో పాటు సీజ్ చేసిన వాహనాలను తప్పించడానికి లంచం అడుగుతూ పోలీసులు ఏసీబీకి పట్టుబడుతున్న ఉదంతాలు నెల రోజుల్లోనే రెండు కేసులు నమోదయ్యాయి. అంటే ఈ వ్యవహారంలో అవినీతి ఆ స్థాయిలో జరుగుతోందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. రేషన్ దందా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొందరు పోలీసులకు మంచి రాబడిగా మారింది.
- ఈ నెల జనవరి 6న మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పీడీఎస్(ప్రజా పంపిణీ వ్యవస్థ) బియ్యం దందాలో సీజ్ చేసిన లారీని విడిపించడానికి అక్కడి సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీశ్ రూ.4 లక్షలు డిమాండ్ చేశారు. తర్వాత రూ.2 లక్షలు తీసుకున్నారు. మరో రూ.2 లక్షల కోసం సదరు వ్యాపారిపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఆ డబ్బులను తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
- సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ వ్యాపారి రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడ్డ వాహనాన్ని విడిపించడానికి తిరుమలగిరి పోలీసు స్టేషన్ ఎస్హెచ్వో(స్టేషన్ హౌస్ ఆఫీసర్) సురేశ్, కానిస్టేబుల్ నాగరాజు రూ.3 లక్షలు డిమాండ్ చేసారు. రూ.70 వేలు తీసుకుంటూ మంగళవారం(జనవరి 28)న ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు.
అందినకాడికి దోచుకోవడమే : పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసే వ్యాపారుల నుంచి నెలనెలా అందికాడికి ముడుపులు తీసుకుంటూ వారికి ప్రత్యక్షంగా సహకరిస్తున్నారు. వరంగల్, మహబూబాబాద్, ములుగు, కామారెడ్డి, నల్గొండ, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం లాంటి సరిహద్దు జిల్లాల్లోని పలు స్టేషన్ల పరిధిలో ఈ దందా విచ్చల విడిగా సాగుతోంది. కింది స్థాయి సిబ్బంది నుంచి స్టేషన్ హౌస్ అధికారి(ఎస్హెచ్వో) వరకు ఎవరి స్థాయిలో వారు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు.
మాముళ్లు ఇవ్వకుంటే క్రిమినల్ కేసులే : తమకు అనుకూలమైన వారిపై 6-ఏ కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు. మామూళ్లు ఇవ్వని వ్యాపారులపై క్రిమినల్ కేసులు పెట్టి వేధిస్తున్నారు. అంతేకాకుండా భారీ ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పలువురు వ్యాపారులు ఏసీబీని ఆశ్రయించి వారిని రెడ్ హ్యండెడ్గా పట్టిస్తున్నారు.
మిల్లర్ల మాయాజాలం : పౌరసరఫరాల శాఖలోని డీలర్లతో అంటకాగుతున్న కొంతమంది మిల్లర్లు, వ్యాపారులు ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యాన్ని వారి నుంచి రూ.12కు కొంటున్నారు. తర్వాత వాటిని పాలిష్ చేసి, రీసైక్లింగ్ పేరుతో తిరిగి ప్రభుత్వానికే రూ.32కు అమ్ముతూ భారీగా నగదు సంపాదిస్తున్నారు. ఆసిఫాబాద్, కొత్తగూడెం, ములుగు జిల్లాల మీదుగా పెద్ద పెద్ద వాహనాల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఆసిఫాబాద్ మీదుగా నిత్యం వందలాది వాహనాల్లో క్వింటాళ్ల కొద్ది రేషన్ బియ్యం మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రాపూర్ లాంటి జిల్లాలకు తరలి వెళుతోంది. మరికొన్ని చోట్ల కొందరు మిల్లర్లు నేరుగా ఈ బియ్యాన్ని డీలర్ల నుంచి సేకరించి బెవరేజెస్ కంపెనీలు తయారీ చేసే బీర్ల కోసం అమ్మేస్తున్నారు.
డీలర్ల నుంచి కొంటూ ప్రభుత్వానికి అమ్ముతూ..
- ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ నుంచి గత 20 ఏళ్లుగా గుంటూరుకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారి రేషన్ బియ్యాన్ని కొంటునే ఉన్నారు. ఈయనపై ఇటీవల కేసు నమోదుకు ప్రయత్నిస్తే నల్గొండ జిల్లాకు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారికి ఏకంగా రూ.10 లక్షల మేర ముడుపులు చెల్లించి కేసు ఫైల్ కాకుండా చేసుకున్నారన్న ఆరోపణలు ఆ శాఖలో ఇటీవల తీవ్ర కలకలం సృష్టించాయి. ఎట్టకేలకు ఆయనపై పీడీ కేసు నమోదు కావడంతో తానిచ్చిన డబ్బులు మళ్లీ తనకు తిరిగి ఇవ్వాలని ఆ వ్యాపారి జిల్లాలోని ఓ పోలీసు ఉన్నతాధికారి వెంటపడుతున్నట్లు తెలిసింది.
- కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలోని ఓ గోదాములో అక్రమంగా నిల్వ ఉన్న 206 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఇటీవల పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. చాలా రోజులుగా ఓ మిల్లు యజమాని ఈ దందా చేస్తున్నా అక్కడి స్థానిక పోలీసులు ఆయనకు సహకరించడంతోనే ఇన్ని రోజులు ఆయనపై ఒక్క కేసూ నమోదు కాలేదని తెలిసింది.
- మూడు జిల్లాలకు సరిహద్దుగా ఉన్న హనుమకొండ జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో రేషన్ దందాకు ప్రధాన అడ్డాగా ఉన్న ఆ ప్రాంతంలోని మిల్లు నుంచి నెలకు రూ.లక్ష వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు భారీగా వినిపిస్తున్నాయి. వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎస్ఐబీ పోలీసుల ద్వారా సమగ్ర వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
అక్కడ మొదటి నెల జీతం కావాలంటే - లంచం కొట్టాల్సిందే
'నా భార్య రోజూ రూ.లక్షల్లో లంచం డబ్బు తెస్తుంది - మా ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే'