Bhadradri Temple EO Fires On USA Team Over Collection of Donations : భద్రాచలం రామయ్య ఆలయం పేరిట యూఎస్ఏకు చెందిన భద్రాద్రి శ్రీ రామటెంపుల్ నిర్వాహకులు కోట్ల రూపాయల విరాళాలు సేకరిస్తున్నారని భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి ఆరోపించారు. ఈ విషయంలోనే యూఎస్ఏ ఆలయ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ఈరోజు భద్రాద్రి శ్రీ రామటెంపుల్ ఆఫ్ యూఎస్ఏ పేరుతో భద్రాచలంలోని ఆర్యవైశ్య సత్రంలో సీతారాముల కల్యాణం చేసేందుకు సిద్ధపడగా ఈవో అడ్డుపడ్డారు. భద్రాద్రి పేరుతో విరాళాలు ఎలా సేకరిస్తారని మండిపడ్డారు. భద్రాచలం పేరును ఎలా ఉపయోగిస్తున్నారని ప్రశ్నించారు.
ఇప్పటికే భద్రాద్రి శ్రీరామ టెంపుల్ యూఎస్ఏ పేరుతో కోట్ల రూపాయలు విరాళాలు సేకరించారని తెలుసుకున్న ఈఓ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. యూఎస్ఏలోని అట్లాంటా నగరంలో భద్రాద్రి నమోనాతో పోలిన ఆలయాన్ని నిర్మించి ఖగోళ యాత్రలో అనేక చోట్ల సీతారాముల కల్యాణాన్ని చేస్తున్నట్లు గుర్తించినట్లు ఈవో ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ పేరుతో భద్రాచలంలోని ఆర్యవైశ్య సత్రంలో సీతారాముల కల్యాణం చేసేందుకు ఇవాళ సిద్ధపడగా వారిని ఆమె అడ్డుకున్నారు.
భద్రాద్రి అర్చకులు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనరాదు : భద్రాద్రి పేరుతో ఎవరు విరాళాలు సేకరించినా, భద్రాద్రి ఆలయం పేరును వాడినా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ వివాదంపై మీడియా సమావేశం నిర్వహిస్తుంచిన ఈవో, పలు వివరాలను వెల్లడించారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పేరును వాడిన, మూలవరుల చిత్రాలు ఉపయోగించిన, భద్రాద్రి పేరుతో విరాళాలు సేకరించిన కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి ఆలయ కార్యనిర్వాహణ అధికారి ఎల్ రమాదేవి తెలిపారు.