Health Benefits of Jaggery :దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మలగన్న అమ్మ, ఆ దుర్గమ్మని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తాం. ఆ తల్లికి ఇష్టమైన అనేక పిండివంటలు చేసి నైవేద్యంగా నివేదిస్తాం. ఎవరి శక్తికి తగ్గట్లు వారు ఆ పరాశక్తిని కొలుస్తారు. అయితే పూజకు స్పెషల్గా చేసే ప్రసాదాల విషయానికొస్తే ఎన్ని రకాల పిండివంటలు తయారు చేసినా - పానకం, వడపప్పు, చలిమిడి మాత్రం తప్పనిసరిగా నివేదించాలని పెద్దలు చెబుతారు. ఇలా అమ్మవారికి నివేదించే ఈ ప్రసాదాల్లో మన ఆరోగ్యానికి మేలు కలిగించే ఎన్నో సుగుణాలుండడం గమనార్హం.
నైవేద్యానికి నవగాయ పిండివంటలు లేకున్నా, అవి వండడానికి ఒంట్లో ఓపిక లేకపోయినా ఇంట్లో చిన్న బెల్లం ముక్క ఉంటే చాలంటారు పెద్దలు. బెల్లంతో చేసిన వంటకాలతో దేవతలు సైతం తృప్తి చెందుతారట. అంతటి విశిష్ట స్థానం ఉంది మరి దీనికి. అందుకే దాదాపు ప్రతి పండగకు తయారు చేసే నైవేద్యంలో బెల్లాన్ని వాడుతాం. దీనివల్ల కేవలం నోటికి రుచే కాకుండా, అనేక రకాల పోషకాలు కూడా మన శరీరానికి అందుతాయి.
- బెల్లం వివిధ రకాల పోషకాలకు నిలయం. ఇందులో అనేక ఖనిజాలు ఉన్నాయి. ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, శరీర సౌష్ఠవానికి, ఎదుగుదలకు కావలసిన ఇతర ఖనిజాలు కూడా బెల్లం నుంచే మనకు లభిస్తాయి.
- శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి బెల్లం బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా అలసటగా అనిపించినప్పుడు ఓ బెల్లం ముక్కను నోట్లో వేసుకోండి, వెంటనే అలసట మాయమవుతుంది.
- బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది.
- ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, శరీరానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ వల్ల కణజాల వ్యవస్థ (టిష్యూ సెల్) దెబ్బతినకుండా కాపాడతాయి.
- బెల్లం సహజసిద్ధమైన క్లెన్సింగ్ ఏజెంట్‌లా పనిచేసి శ్వాసకోస గ్రంథులు, ఊపిరితిత్తులు, పొట్ట వంటి శరీర అవయవాలను శుభ్రపరుస్తుంది.