Benefits Of Employment Card : పలు రంగాల్లో జాబ్‌లు పొందేందుకు ఉపాధి కార్డులు ఊతంగా నిలుస్తున్నాయి. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన నిరుద్యోగ యువత వద్ద ఈ కార్డులుంటే వారికి మొదటి ప్రాధాన్యమిస్తున్నాయి. అవగాహనలేమితో పలువురు పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవడం లేదు. దీంతో ఉద్యోగ అవకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం శాశ్వత కార్డులను జారీ చేస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు అధిక సంఖ్యలో నమోదు చేసుకోవాలని ప్రాంతీయ ఉపాధి కల్పనాధికారి కోరుతున్నారు.
కళాశాలల్లో అవగాహన :విద్యార్థులకు మరింత చేరువై వారి పేర్ల నమోదుకు డిగ్రీ, పీజీ కళాశాలల్లో జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం( జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీస్‌లు) మేళాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగానే నేషనల్ కెరియర్ డాటా సర్వీసెస్‌లో పేర్లు నమోదవుతాయి. కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి ఉద్యోగాలకు పిలుపు అందుతుందని అధికారులు చెబుతున్నారు.
24 గంటల్లోనే ఉపాధి కార్డు అందజేత :గతంలో ఒకసారి కార్డును తీస్తే వాటిని తిరిగి రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుండేది. ప్రస్తుతం వాటి స్థానంలో శాశ్వత కార్డులను అందజేస్తున్నారు. దీనిపై నిరుద్యోగ యువతకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. జాబ్ మేళాకు హాజరయ్యే వారికి ఉపాధికార్డులు లేకపోతే అప్పటికప్పుడు దరఖాస్తు తీసుకొని ఒక్క రోజులోనే శాశ్వత కార్డులను అందిస్తున్నారు.